కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో యువతకు ఫారిన్ జాబ్స్ 

కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో యువతకు ఫారిన్ జాబ్స్ 
  • విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వివేక్ భేటీ 
  • స్కిల్ ట్రెయినింగ్, పాస్ పోర్టు సేవలు, ఇమిగ్రేషన్ లో కోఆర్డినేషన్ చేస్కోవాలన్న మంత్రి  
  • చట్టబద్ధమైన వలస విధానాలపై అవగాహనకు భేటీలో నిర్ణయం
  • యువతకు ‘విదేశీ ఉపాధి’లో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్ర బృందం ప్రశంసలు 

హైదరాబాద్, వెలుగు: మన యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణ, పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్ సేవలు, ఇమిగ్రేషన్ విధానాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అత్యవసరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.

టెక్నికల్ ఎడ్యుకేషన్ తో పాటు విదేశీ భాషల్లో పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కొలువులు సాధించడం సులభతరం అవుతుందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. గ్లోబల్ డిమాండ్ కు అనుగుణంగా ప్రొఫెషనల్ కోర్సులను విస్తరించడంతో పాటు విదేశీ నియామకాలకు సన్నద్ధం చేసేలా మెంటార్లు, కెరీర్ గైడ్ లతో కూడిన పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే, కార్పొరేట్ శిక్షణా సంస్థలను విదేశీ సంస్థలతో అనుసంధానం చేయాలని, ప్రధానంగా అక్రమ వలసలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కేంద్ర బృందం కోరింది.

ఈ సందర్భంగా టామ్‌‌‌‌‌‌‌‌కామ్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, ఐటీఐలను అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసి ఇస్తున్న శిక్షణ తదితర అంశాలను కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన కిశోర్ కేంద్ర అధికారులకు వివరించారు. పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్ జారీ ప్రక్రియను మరింత సరళతరం చేయడంతో పాటు దరఖాస్తు సమయంలోనే సురక్షిత, చట్టబద్ధ వలస విధానాలపై యువతకు అవగాహన కల్పించాలని ఈ భేటీలో నిర్ణయించారు. 

విదేశీ కల్చర్ పై అవగాహన కల్పించడం భేష్​.. 

విదేశీ ఉపాధి ప్రోత్సాహంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలను శ్రీప్రియ రంగనాథన్ ప్రత్యేకంగా అభినందించారు. విదేశాలకు వెళ్తున్న మన యువతకు అక్కడి చట్టాలతో పాటు సాంస్కృతిక పరిస్థితులపై కనీస అవగాహన కల్పించడాన్ని జాతీయ ప్రాధాన్యతా అంశంగా పరిగణించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసే నైపుణ్య ధృవీకరణ పత్రాలను కేంద్ర సంస్థల ద్వారా ప్రామాణీకరించేలా ఇరు ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరమని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే రాష్ట్రంలో జారీ చేస్తున్న పలు సర్టిఫికేషన్లు జాతీయ వృత్తి విద్యా శిక్షణా మండలి లాంటి ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల గుర్తింపు పొందడం ఒక సానుకూల పరిణామంగా పేర్కొన్నారు. ఈ ఉన్నతస్థాయి భేటీలో సంయుక్త కార్యదర్శి, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ సురిందర్ భగత్ తో పాటు ప్రాంతీయ పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అధికారి అజిత్ జాన్ జాషువా సూచనలు చేశారు. విదేశీ భాగస్వాములతో మన కార్పొరేట్ శిక్షణా సంస్థలను కలపడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత పెరిగి, తద్వారా స్థానిక యువతకు మరింత మేలు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.