యాదగిరి గుట్టలో కనులపండువగా నారసింహుడి కల్యాణం

యాదగిరి గుట్టలో కనులపండువగా  నారసింహుడి కల్యాణం
  • ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
  • ఉదయం శ్రీరాముడి అలంకారంలో 
  • హనుమంత వాహనంపై ఊరేగిన నారసింహుడు
  • రాత్రి గజవాహన సేవ, తిరు కల్యాణమహోత్సవం
  • నేడు నారసింహుడి దివ్యవిమాన రథోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : అర్చకుల వేదమంత్రాలు, పారాయణాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ లక్ష్మీ నారసింహుల కల్యాణం కనులపండువగా సాగింది. యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ప్రధానాలయ ఉత్తరం వైపున ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో స్వామిఅమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. రాత్రి 9.30 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం సుమారు రెండు గంటల పాటు సాగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి స్వామి వారికిపట్టు వస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలను అందజేశారు. నారసింహుడిని పెండ్లికొడుకుగా ముస్తాబు చేసిన అర్చకులు ప్రధానాలయ మాఢవీధుల్లో గజవాహనంపై విహరింపజేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు గజవాహనంపై కల్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా అధిష్ఠింపజేసి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. 

ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ జీలకర్రబెల్లం, కన్యాదానం తర్వాత తులా లగ్న ముహూర్తంలో మాంగల్యధారణ జరిపించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తలంబ్రాల వేడుకను నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి కల్యాణంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సతీమణి సుధ, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణీభరత్‌గౌడ్‌ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీరామచంద్రుడి అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగించారు. అనంతరం ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట అధిష్ఠింపజేసి అలంకార విశిష్టతను వివరించారు.  బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేశాయి. స్వామివారి కల్యాణం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముగ్గురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 20 మంది ఎస్సైలతో మొత్తం 200 మందితో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన నిర్వహిస్తున్న పలు రకాల సాంస్కృతిక, ధార్మిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలను భక్తులను విశేషంగా అలరించారు. పలువురు చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

నేడు దివ్యవిమాన రథోత్సవం

నారసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారు శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగనున్నారు. రాత్రి 7.30 గంటలకు దివ్య విమాన రథోత్సవాన్ని జరపనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.