హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని బడుల్లో 100 శాతం ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్ల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. బుధవారం డైరెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
టికెట్ల జారీ నుంచి కాలేజీ అడ్మిషన్ల వరకు ప్రతిదానికి ఆధార్ కీలకంగా మారిందని, అందుకే విద్యార్థులు, తల్లిదండ్రులు మీసేవ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా బడిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.
నీట్, జేఈఈ, ఐఐటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సమయంలో ఆధార్ వివరాలు సరిగ్గా లేక, బయోమెట్రిక్ అప్‌డేట్ కాక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని నవీన్ నికోలస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను ముందే పరిష్కరించేందుకు యుఐడీఏఐ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకోసం మూడు ప్రత్యేక ఏజెన్సీలను రంగంలోకి దించామన్నారు. ఒక్కో ఏజెన్సీకి 11 జిల్లాల చొప్పున బాధ్యతలు అప్పగించామని, నిర్ణీత గడువులోగా ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎంలు సంబంధిత ఆధార్ ఏజెన్సీలతో మాట్లాడి స్కూల్ ఆవరణలోనే ఆధార్ కిట్లను ఏర్పాటు చేయిస్తారని, దీంతో పేరెంట్స్‌కు శ్రమ, సమయం ఆదా అవుతుందని డైరెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్, యూఐడీఏఐ ప్రాజెక్ట్ మేనేజర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
