తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు.!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు.!
  • పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే చాన్స్​
  • ఎస్టీలకు 3 నుంచి 4 శాతం, ఎస్సీ లకు 13 నుంచి 14 శాతం సీట్లు
  • జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12 శాతం 
  • ఇవ్వాలని అధికార పార్టీ యోచన.. అదే బాటలో మిగిలిన పార్టీలు?

హైదరాబాద్​, వెలుగు:  మున్సిపల్​ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు దక్కనున్నాయి. పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువగా ఉండడంతో  చట్టపరంగా బీసీలకు 32 నుంచి 34 శాతం సీట్లు వచ్చే చాన్స్​ ఉన్నది. 2019 మున్సిపల్​ యాక్ట్​ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్​ రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్టీలకు 3 నుంచి 4% , ఎస్సీలకు 13 నుంచి 14 శాతానికి  దక్కే అవకాశం ఉన్నది.  అంటే ఈ రెండు వర్గాలకు కలిపి కనిష్టంగా 16 శాతం, గరిష్టంగా 18శాతం సీట్లు వస్తాయి. దీంతో మిగిలిన 32 నుంచి 34 శాతం సీట్లు బీసీలకేనని అధికారులు చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు మాత్రం డెడికేటెడ్​ కమిషన్​ లెక్కలను పరిగణనలోకి తీసుకోనున్నారు. 

జనరల్ ​స్థానాల్లోనూ బీసీలకు సీట్లు

వచ్చే నెలలో మున్సిపల్​ఎన్నికలు నిర్వహించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6  కార్పొరేషన్ల లో ఎన్నికల​ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తున్నది. మొత్తం 123 బల్దియాల్లో 2,996 వార్డులు ఉన్నట్లు ఇప్పటికే  అధికారికంగా ప్రకటించింది. ఈ వార్డులతోపాటు చైర్మన్​ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు.

2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 3 నుంచి 4 శాతం, ఎస్సీ లకు 13 నుంచి 14 శాతం దక్కే అవకాశం ఉండగా, డెడికేటెడ్​కమిషన్​లెక్కల ప్రకారం బీసీలకు 34 శాతం దాకా సీట్లు వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నది.  రాజ్యాంగంపరంగా దక్కే రిజర్వేషన్లతోపాటు జనరల్​ సీట్లలోనూ బీసీలకు వీలైనన్ని ఎక్కువ స్థానాలను కేటాయించాలని అధికారపార్టీ భావిస్తున్నది. హైకమాండ్​ ఆదేశాలతో ఇప్పటికే  పీసీసీ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. మరోవైపు కాంగ్రెస్​బాటలోనే  బీజేపీ, బీఆర్ఎస్ కూడా జనరల్​ స్థానాల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల ముగిసిన సర్పంచ్​ ఎన్నికల్లో జనరల్​స్థానాల్లోనూ బీసీలు సత్తా చాటడడమే ఇందుకు కారణమని, ఏకంగా 52 శాతం సీట్లను గెలుచుకోవడంతో రాజకీయపార్టీలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయని  విశ్లేషకులు చెప్తున్నారు. ఈ లెక్కన మున్సిపాలిటీల్లోనూ బీసీలు 50 శాతానికి పైగా సీట్లలో పాగా వేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 

ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు.. 

ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న బల్దియాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని 124 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలోని వార్డులు, చైర్మన్ స్థానాలకు ఒకేసారి రిజర్వేషన్లను  ఖరారు చేయనున్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు తెలిపారు. 2020 మున్సిపల్​ ఎన్నికల సమయంలోనూ అప్పటి ప్రభుత్వం ఇలాగే చేసింది. గ్రేటర్​ హైదరాబాద్​ (జీహెచ్ఎంసీ), వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు పలు మున్సిపాలిటీల చైర్మన్లు, వార్డుల రిజర్వేషన్లను ముందుగానే  ప్రకటించింది. ఈసారి కూడా వీటిన్నింటికీ ఒకేసారి రిజర్వేషన్లు ఖరారుచేసి, రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ముసాయిదా ఓటర్ల నోటిఫికేషన్​ జారీ చేసి, వార్డులవారీగా ఓటర్ల లిస్ట్​ ప్రకటించింది. మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టరేట్లలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది.

తాజాగా.. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్​కార్యాలయంలో కమిషనర్​ రాణి కుముదిని పొలిటికల్​ పార్టీల లీడర్లతో మీటింగ్​ నిర్వహించారు. మరోవైపు 3 వార్డులకు ఒకరి చొప్పున ఆర్వోలు, ఏఆర్వోలను నియమిస్తూ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్​ కమిషనర్లు జాబితా రెడీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,39‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 ఆర్వోలు, 1,480 ఏఆర్వోల పేర్లతో కూడిన జాబితాలు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరాయి. మున్సిపాలిటీల్లో 18కి పైగా వార్డులున్న చోట అదనంగా ఒకరు, కార్పొరేషన్లలో ఇద్దరు చొప్పున ఆర్వోలు, ఏఆర్వోలను నియమించనున్నారు. ఎన్నికల నిర్వహణలో  రిటర్నింగ్​ ఆఫీసర్లు (ఆర్వో), అసిస్టెంట్​ రిటర్నింగ్​ ఆఫీసర్ల (ఏఆర్వో)  పాత్ర కీలకం. పోలింగ్‌‌‌‌‌‌‌‌బూత్‌‌‌‌‌‌‌‌లవారీగా ఓటర్ల జాబితా ప్రకటించడం, వార్డులవారీగా ఎన్నికల నోటిఫికేషన్​ జారీ చేయడం నుంచి నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, విత్​ డ్రా, గుర్తుల కేటాయింపు, పోలింగ్​ నిర్వహణ, కౌంటింగ్..​ అనంతరం గెలిచిన విజేతలకు పత్రాలు అందజేయడం లాంటి బాధ్యతలన్నీ వీరే నిర్వర్తించనున్నారు.