విషయం ఏదైనా చర్చలతోనే పరిష్కారం అవుతుంది.. అలా కానప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కోవటానికి రెడీగా ఉన్నాం.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం.. యుద్ధమే కావాలంటే అందుకు సిద్ధంగానే ఉన్నాం అని ప్రకటించారు ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అబ్బాస్.
టెహ్రాన్ లో పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం అని.. కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందని.. ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదంటూ అమెరికాను పరోక్షంగా హెచ్చరించారాయన. మేం యుద్ధాన్ని కోరుకోవటం లేదు.. అయినా కూడా యుద్ధం చేయటానికి పూర్తిగా రెడీ అయ్యి ఉన్నామని స్పష్టం చేశారాయన.
లెబనాన్ దేశ పర్యటనకు వచ్చిన ఇరాన్ విదేశీ మంత్రి.. అక్కడ గ్లోబల్ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులు, దాడులు మంచిది కాదన్నారు. ఇరాన్ దేశ వ్యవహారాల్లో మిగతా దేశాల జోక్యాన్ని సహించం అని.. టెహ్రాన్ లో జరుగుతున్న అల్లర్లు త్వరలోనే అదుపులోకి వస్తాయని.. అన్నీ సర్దుకుంటాయని.. ఇది ఇరాన్ దేశ అంతర్గత వ్యవహారం అని వివరించారాయన.
►ALSO READ | ఇరాన్ లో మరోసారి పెట్రేగిన ఆందోళనలు..ప్రభుత్వ మీడియా ఆఫీసుకు నిప్పు
రెండేళ్లుగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని లెబనాన్, ఇరాన్ దేశాలతోపాటు అనేక దేశాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని.. కాల్పుల విరమణ ఒప్పందాలను పదే పదే ఉల్లంఘిస్తూ లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించటం దుర్మార్గమన్నారు అబ్బాస్.
ఇరాన్, లెబనాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వ్యాపార, దౌత్య సంబందాలు ఉన్నాయని.. లెబనాన్ దేశానికి ఇరాన్ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారాయన.
