పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి దర్శకత్వంలో రూపొందిన, ఈ హారర్ ఫాంటసీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ప్రభాస్‌కు ఇది మరో మ్యాజిక్ అయ్యిందా? పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ను మారుతి ఎంతవరకు నిలబెట్టగలిగాడు? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
రాజాసాబ్ కథ:
ఒకప్పుడు రాజవంశ వారసత్వానికి చెందిన, రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్), తన నానమ్మ గంగాదేవి అలియాస్ గంగవ్వ (జరీనా వాహెబ్)తో కలిసి ఉంటాడు. రాజుకు తన నానమ్మంటే ప్రాణం. అయితే, ఆర్థిక ఇబ్బందుల మధ్య రాజు సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. గంగాదేవి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుంటుంది. తనకు సంబంధించిన చాలా విషయాల్ని మరిచిపోయినా, తన భర్త కనకరాజు (సంజయ్ దత్)ని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు.
ఈ క్రమంలో కనకరాజు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసిన రాజాసాబ్, తాత కోసం సిటీకి వస్తాడు. అక్కడ బ్లెస్సీ (నిధి అగర్వాల్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అదే సమయంలో అతన్ని వెతుక్కుంటూ వచ్చిన భైరవి (మాళవిక మోహన్) కూడా రాజాసాబ్‌తో ప్రేమలో పడుతుంది. భైరవి ద్వారా, తాత నర్సాపూర్ అడవిలో ఉన్న ఓ పురాతన కోటలో ఉన్నాడని రాజాసాబ్‌కు తెలుస్తుంది. తమ కుటుంబానికి చెందిన మాయసభలా కనిపించే అతి పురాతనమైన ఒక రహస్య భవనంలో రాజాసాబ్, అడుగుపెడతాడు. కట్ చేస్తే.. కనకరాజే తనకున్న రకరకాల విద్యలతో నాన్నమ్మ, మనవడిని నర్సాపూర్ అడవిలోని రాజమహల్‌కి వచ్చేలా చేస్తాడనేది ట్విస్ట్గా మారుతుంది. అయితే, ఒక దశలో ఇద్దరినీ చంపేయాలని కూడా అనుకుంటాడు తాత కనకరాజ్.
అలా ఆ మర్మమైన భవనంలోకి అడుగుపెట్టిన తర్వాత, రాజాసాబ్ ఎదుర్కొన్న సమస్యలేంటి? మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు దేవనగర సామ్రాజ్యానికి చెందిన జమీందారిణిగా ఉన్న గంగాదేవి, సామాన్యురాలిగా ఎందుకు మారాల్సి వచ్చింది? తమ కుటుంబం కోల్పోయిన వారసత్వ సంపదను రాజాసాబ్ ఎలా తిరిగి దక్కించుకున్నాడు? ఈ కథలో గంగరాజు (సముద్రఖని) పాత్ర ఏంటి? ఇంతకీ కనకరాజు వెనుకటి కథ ఏమిటి? అతని లక్ష్యం ఏమిటి? అనిత (రిద్ది కుమార్) ఎవరు? అనే తదితర విషయాలు తెలియాలంటే రాజాసాబ్ థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ:
రొమాంటిక్, కామెడీ, హారర్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ వంటి ఎలిమెంట్స్తో సినిమా తీయడం చాలా పెద్ద టాస్క్. అలాంటిది మీడియం రేంజ్ సినిమాలు తీసే దర్శకుడు, పాన్ ఇండియా స్టార్తో తెరకెక్కించడం అంటే, అది పూర్తిగా సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే, ఇలాంటి జానర్ సినిమాలకు హీరో క్యారెక్టరైజేషన్, చీకటి లోకేషన్లు, ఊహించని ట్విస్టులతో హారర్ టోన్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేసే సత్తా కావాలి. అపుడే ఆడియన్స్ థియేటర్ సీట్లో అతుక్కుని కూర్చుంటారు. అయితే, కొన్నిసార్లు స్టార్ సినిమాలకి లాజిక్కులు అక్కర్లేదు, మేజిక్కులన్నా సరిపోతుంది. కథనంలో దమ్ముండి, స్క్రీన్ ప్లే పక్కాగా కుదిరితే ఇక చెప్పేదేం లేదు. ఇలాంటి అంచనాలను మారుతి కొద్దివరకు మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ, పూర్తిగా అందుకోలేకపోయాడు.
ఎందుకంటే, ప్రభాస్ వంటి భారీ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్లుగానే కథను రాసుకున్నా.. దాన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం దర్శకుడు మారుతి తడబడ్డాడు. అయితే, ప్రభాస్ డైలాగ్స్తో, కామెడీ కంటెంట్తో, ఆకట్టుకునే విజువల్స్తో, డిఫెరెంట్ హారర్, యాక్షన్ సన్నివేశాలతో కాస్త కప్పిపుచ్చాయనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే ఇంకా బలంగా రాసుకుని, ప్రోజెక్ట్ చేసి ఉంటే ఇంకా బలంగా ఉండే ఫీలింగ్ కలిగించేలా చేశాడు మారుతి. అందువల్ల రాజాసాబ్ కథలో ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ ప్రేక్షకుల్ని వెంబడిస్తుంది.
సినిమా ప్రారంభమైన తర్వాత, ప్రేక్షకుడు సినిమా చూస్తున్న అనుభూతికంటే ఒక కొత్త లోకంలోకి ప్రవేశించిన భావన కలిగేలా మారుతి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఆయన చాలా వరకు విజయం సాధించాడు. అయితే, అసలు కథలోకి ప్రవేశించడానికి ముందుగా పాత్రల పరిచయాలకు ఎక్కువ సమయం కేటాయించడంతో కథ ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా అనిపిస్తుంది. రాజ్ మహల్‌లోకి అడుగుపెట్టే సన్నివేశం కొంత ఉత్కంఠను కలిగించినా, అది ఎక్కువసేపు నిలవదు. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, కథలో సరైన టెన్షన్ బిల్డప్ లేకపోవడంతో అవి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేవు. మారుతి మార్క్ కామెడీతో అక్కడక్కడా ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని బాగా రేకెత్తిస్తుంది.
ప్రేక్షకుడి అటెన్షన్‌ను పూర్తిగా సెకండాఫ్ పై ఉంచేలా ఎపిసోడ్స్ డిజైన్ చేశాడు. ముఖ్యంగా సుదీర్ఘంగా సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ తెలుగు హారర్ సినిమాల్లో ఇప్పటివరకు పెద్దగా చూడని విధమైన ట్రీట్మెంట్‌తో రూపొందించాడు. పాత సినిమాల ఫార్మూలాను పక్కన పెట్టి, సైకాలజీ కోణాన్ని కథతో అనుసంధానం చేస్తూ క్లైమాక్స్‌ను ముగించిన విధానం కొత్తదనాన్ని అందిస్తుంది. ఏదేమైనా వాస్తవానికి ఇది ఐడియాగా చెప్పడానికి చాలా కష్టమైన విషయం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మారుతి కొంతమేర విజయం సాధించాడు.
టెక్నీకల్ అంశాలు:
సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది విజువల్ ప్రెజెంటేషన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తెరపై కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్షన్, సెట్స్, ముఖ్యంగా నర్సాపూర్ అడవిలోని రాజమహల్ సెటప్ చాలా గ్రాండ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ డార్క్ టోన్‌కు తగ్గట్లుగా బాగుంది. లోకేషన్లను, లైటింగ్‌ను చక్కగా ఉపయోగించి హారర్ ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సన్నివేశాల్లో CGI మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాల్లో ప్లస్ అయ్యింది. హారర్ సీన్స్‌లో మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. పాటలు కథ ప్రవాహాన్ని పెద్దగా డిస్టర్బ్ చేయవు కానీ గుర్తుండిపోయే స్థాయిలో మాత్రం లేవు. కానీ, “నాచే నాచే” పాట ప్రేక్షకులకు కనువిందు చేసింది.
ఫస్ట్ హాఫ్‌లో ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేది. చివరగా.. డైరెక్టర్ మారుతి కొత్త తరహా కథను ఎంచుకుని సక్సెస్ అయ్యాడు. రైటింగ్-మేకింగ్ లో తనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. కొన్ని స్కీన్లకి ఇంకా బలమైన స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే, మరింత ఎలివేట్ అయ్యేది.
నటీనటుల నటన:
హీరో ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా ఆల్ రౌండర్‌గా నటించడానికి ఇందులో మంచి స్కోప్ దొరికింది. కొన్ని సన్నివేశాల్లో పాత విన్టేజ్ ప్రభాస్ గుర్తుకొచ్చేలా నటించి మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇలాంటి వింటేజ్ ప్రభాస్ను చూడలాంటే, మరికొన్ని ఏళ్లు పడుతుంది.
సంజయ్ దత్ పాత్రకు మంచి వెయిట్ ఉంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది. జరీనా వాహెబ్ ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఇంపాక్ట్ చూపించింది. హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ పాత్రలు గ్లామర్‌తో పాటు కథకు అవసరమైనంత వరకే పరిమితమయ్యాయి. సముద్రఖని, బొమన్ ఇరానిల పాత్ర కథలో కీలకంగా నిలుస్తుంది. ఇకపోతే, కమెడియన్స్ సత్య, సప్తగిరిది, ప్రభాస్ శీను, వీటీవీ గణేష్ తమ పాత్ర పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు.
