న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ట్రంప్‌తో నేరుగా ఫోన్ మాట్లాడకపోవడం వల్లే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యమైందని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు సరియైన కావని తోసిపుచ్చింది. అతడి వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు లుట్నిక్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. శుక్రవారం (జనవరి 9) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాతో పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చోవడానికి భారత్ ఆసక్తిగా ఉందని తెలిపారు.
2025, ఫిబ్రవరి నుంచే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపాయని.. చాలాసార్లు డీల్‌కు చేరువయ్యామని పేర్కొన్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్ ముగించాలని ఎదురు చూస్తున్నామన్నారు. ప్రధాని మోడీ స్వయంగా ట్రంప్ ఫోన్ చేయడం వల్లే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతోందని లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. 2025లో ట్రంప్, మోడీ 8 సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని.. వివిధ అంశాలపై చర్చించారని వెల్లడించారు.
జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం:
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలను 500 శాతానికి పెంచే ప్రతిపాదిత అమెరికా బిల్లుపైన రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ బిల్లు గురించి భారత ప్రభుత్వానికి తెలుసని.. దాని వల్లే ఎదురయ్యే సమస్యలు, పర్యవసానాలను ఇండియా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇంధన వనరుల విషయానికొస్తే మా విధానం మీకు బాగా తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మార్కెట్‌లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటామని.. అదే సమయంలో భారత 1.4 బిలియన్ల ప్రజలకు సరసమైన ధరలకు ఇంధనం అందుబాటులో ఉండేలా చూసుకోవడం మా బాధ్యత అని అన్నారు. అన్ని అంశాలను క్రోడికరించుకుని మా వ్యూహం, విధానాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
లుట్నిక్ ఏమన్నారంటే..?
భారత్-అమెరికా మధ్య జరగాల్సిన కీలక ట్రేడ్ డీల్ ఎందుకు ఆగిపోయిందో వివరిస్తూ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడమే ఈ ఒప్పందం పట్టాలెక్కకపోవడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్ భారత్‌లో అడుగుపెట్టనున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాను వాణిజ్య ఒప్పందానికి అన్ని ఏర్పాట్లు చేశానని ఒక ఇంటర్వ్యూలో లుట్నిక్ పేర్కొన్నారు. కానీ ప్రధాని మోడీ స్వయంగా ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఫోన్ చేసి మాట్లాడాల్సి ఉంది. భారత్ అందుకు సుముఖంగా లేకపోవడంతో ఆ ఫోన్ కాల్ జరగలేదు. దీనివల్ల ఇద్దరు నేతల మధ్య ఉండాల్సిన రాజకీయ సంకేతాలు అందలేదని చెప్పుకొచ్చారు. గతంలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాల నుంచి ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గిందని.. పాత నిబంధనలకు తాము కట్టుబడి లేమని కూడా స్పష్టం చేయటం గమనార్హం.
