ఒడిశా సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

ఒడిశా సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

భారతీయ జనతా యువ మోర్చా (BJYM)కార్యకర్తలు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కాన్వాయ్‌పై  కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ లోని  దర్జీపోఖారీ ఛక్‌ దగ్గర ఇవాళ( బుధవారం) ఈ దాడి జరిగింది.  శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను దాటుకుని వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు.  ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హోంశాఖ సహాయ మంత్రి  గోబింద సాహుతో శంకర్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది BJYM.మహిళా టీచర్‌ మమతా మెహర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్‌ మిశ్రా సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే  కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి.

సీఎం కాన్యాయ్‌పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని BJYM ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్‌ ఆచార్య తెలిపారు. సీఎం నవీన్ పట్నాయక్ ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతామన్నారు. శంకర్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.