70 కాలేజీల్లో పాత ఫీజులే!..ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఫిక్స్

70 కాలేజీల్లో పాత ఫీజులే!..ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఫిక్స్
  • ప్రభుత్వానికి టీఏఎఫ్‌‌ఆర్‌‌సీ నివేదిక.. త్వరలోనే జీవో
  • ఓ కాలేజీలో అత్యధికంగా 62వేలు.. అత్యల్పంగా 
  • రూ.50 పెరిగిన ఫీజు 
  • సీబీఐటీలో అత్యధికం రూ. 1.83 లక్షలు ఫీజు

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ ఫీజుల పంచాయితీ తేలింది. రాబోయే మూడేండ్ల 2025–2028 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్​ఆర్సీ) ఫైనల్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేయగా.. త్వరలోనే అధికారిక జీవో విడుదల కానుంది. అయితే ఈసారి ఫీజుల పెంపులో సర్కారు కఠినంగా వ్యవహరించింది.

 ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపును సాధ్యమైనంత వరకూ కట్టడి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 కాలేజీల్లో పాత ఫీజులనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించగా, 63 కాలేజీల్లో ఫీజులను పెంచారు. మరో 19 కాలేజీల్లో మాత్రం గతంలో కంటే ఫీజులు తగ్గించారు.

రాష్ట్రవ్యాప్తంగా 157 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025–26, 2026–27, 2027–28  విద్యా సంవత్సరాలకుగానూ కొత్త ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. ప్రైవేటు కాలేజీల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా ఆయా కాలేజీల్లో ఫీజులను గతంలోనే  ప్రిలిమినరీగా ఫైనల్ చేసింది. 

దీనిలో దాదాపు అన్ని కాలేజీల్లోనూ పదిశాతం నుంచి 30శాతం మేర పెంచినట్టు తెలిసింది. దీనిపై సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ విద్యాసంవత్సరం పాత ఫీజులే ఉంటాయని ఏకంగా ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. దీనిపై కొందరు కోర్టుకు పోవడంతో ఫీజులను ఖరారు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈ క్రమంలోనే కాలేజీల ఆదాయ వ్యయాలతో పాటు అకడమిక్ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను ఫైనల్ చేసి ప్రభుత్వానికి పంపింది. దీనిపై అధికారికంగా జీవో రావాల్సి ఉంది. 

19 కాలేజీల్లో తగ్గిన ఫీజులు

దాదాపు సగం ఇంజినీరింగ్ కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్ 2022లో నిర్ణయించిన ఫీజులే... మరో మూడేండ్లు కంటిన్యూ కానున్నాయి. టీఏఎఫ్​ఆర్సీ ఫీజుల నిర్ణయంతో ఆడిట్ లెక్కలతో పాటు అకాడమిక్ అంశాలనూ పరిగణలోకి తీసుకోవడంతో ఏకంగా 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులపై ఎలాంటి అదనపు భారం పడబోదు. ప్రధానంగా వర్ధమాన్ కాలేజీ (1.40లక్షలు), ఎంజే కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ (1.25లక్షలు), ఏసీఈ ఇంజినీరింగ్ కాలేజీ(1.10లక్షలు), శ్రీఇందు కాలేజీ (1.15 లక్షలు), జేబీఐటీ (1.10 లక్షలు), శ్రేయాస్ ఇనిస్టిట్యూట్ (1.06లక్షలు), వాగ్దేవి కాలేజీ వరంగల్ (1.05లక్షలు),  మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ (లక్ష), భారత్ ఇనిస్టిట్యూట్, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ, ఏవీఎన్ ఇనిస్టిట్యూట్, స్టాన్లీ ఉమెన్స్ కాలేజీ తదితర వాటిలో 2022లో ఉన్న ఫీజులే కంటిన్యూ కానున్నాయి. మరోపక్క, 19 కాలేజీల్లో గతం కంటే ఫీజులు తగ్గడం గమనార్హం. నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏకంగా 45వేల ఫీజు, గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో43వేలు, అనురాగ్ వర్సిటీలో రూ.35వేల ఫీజు, సీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో రూ.31,900 తగ్గింది.

63 కాలేజీల్లో పెరిగినయ్..

ఈ సారి కేవలం 63 కాలేజీల్లో ఫీజులు పెంపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యధికంగా నారాయణమ్మ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉమెన్స్ కాలేజీలో గత బ్లాక్ పీరియడ్‌‌లో (2022) రూ. లక్ష ఉన్న ఫీజును.. ఇప్పుడు ఏకంగా రూ.1.62 లక్షలకు పెంచారు. అంటే ఒక్కో విద్యార్థిపై రూ. 62 వేల అదనపు భారం పడింది. అయితే, 2019  బ్లాక్ పీరియడ్​లో 1.22 లక్షల ఫీజున్న కాలేజీని 2022లో లక్షకు తగ్గించారనీ, ప్రస్తుతం దాన్ని పెంచినట్టు అధికారులు చెప్తున్నారు.

 అయితే, ఒకేసారి 62 శాతం ఫీజు పెంచడం గమనార్హం.  వాసవి కాలేజీలో రూ.35వేలు, గోకరాజు గంగరాజు కాలేజీలో రూ.30,500, శ్రీదేవి ఉమెన్స్ కాలేజీలో రూ.27వేలు, కేశవ్ మెమోరియల్ కాలేజీ( నారాయణగూడ)లోరూ.26,200 ఫీజు పెరిగింది. అత్యల్పంగా స్వామి వివేకానంద ఇనిస్టిట్యూట్ లో కేవలం రూ.50 పెరగ్గా, మల్లారెడ్డి ఇంజినీరింగ్​ కాలేజీలో రూ.200, గీతాంజలి కాలేజీలో రూ.వెయ్యి ఫీజు పెరిగింది. అయితే, 35 కాలేజీల్లో పదివేల కంటే తక్కువ ఫీజు పెరిగింది.