పేలుళ్లకు భారీ కుట్ర..! ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ ఏజెంట్ల అరెస్టు

పేలుళ్లకు భారీ కుట్ర..!  ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ ఏజెంట్ల అరెస్టు

దేశవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం (డిసెంబర్ 18న)  సోదాలు చేశారు. ఇస్లామిక్ టెర్రర్ గ్రూపు ఐసిస్ నెట్ వర్క్ ఛేదించే క్రమంలో ఈ దాడులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేయగా.. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేశారు.

తాజాగా భారీ ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భగ్నం చేసింది. ఈ కేసులో ఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS)తో సంబంధం ఉన్న మొత్తం ఎనిమిది మంది ఏజెంట్లను అరెస్టు చేసినట్లు తెలిపింది. వీరు ఐసిస్‌ బళ్లారి మాడ్యుల్‌కు చెందినవారని, వారి వద్ద నుంచి పేలుడు పదార్థాల నిల్వలు, మారణాయుధాలు, నగదు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. నిందితులు పేలుళ్లకు కుట్ర పన్నారని, ఈ క్రమంలోనే దాడుల ప్రణాళికతో కూడిన కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 

ఎన్‌ఐఏ అధికారులు సోమవారం (డిసెంబర్ 18న) మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 ప్రదేశాల్లో దాడులు చేపట్టారు. బళ్లారి మాడ్యూల్‌పై గత వారమే ‘ఎన్‌ఐఏ’ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు, ఇతర కేంద్ర సంస్థలతో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. బళ్లారి మాడ్యూల్‌ లీడర్‌ మినాజ్‌ అలియాస్‌ మహ్మద్ సులేమాన్‌నూ అరెస్టు చేసినట్లు చెప్పారు.

పేలుడు పదార్థాలను ఉపయోగించి ఐఈడీలు, ఇతర పేలుడు పరికరాలను రూపొందించడానికి ప్లాన్ చేశారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. కళాశాల విద్యార్థులను ఉగ్ర కార్యకలాపాల దిశగా ఆకర్షించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు.