నెల రోజుల్లో హాస్పిటళ్లలో సేఫ్టీ ఆడిట్ : మంత్రి దామోదర్ రాజనర్సింహ  

నెల రోజుల్లో హాస్పిటళ్లలో సేఫ్టీ ఆడిట్ : మంత్రి దామోదర్ రాజనర్సింహ  
  • 6 నెలలకోసారి ఫైర్, ఎలక్ట్రికల్.. ఏటా స్ట్రక్చరల్ ఆడిట్ తప్పనిసరి
  • మంత్రి నేతృత్వంలో రాష్ట్రస్థాయి మానిటరింగ్.. కలెక్టర్ల చైర్మన్‌‌షిప్‌‌లో జిల్లా కమిటీలు
  • సెక్రటేరియెట్ రివ్యూలో మంత్రి దామోదర్ రాజనర్సింహ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో నెల రోజుల్లోగా ఫైర్, ఎలక్ట్రికల్, బిల్డింగ్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్లు పూర్తి చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హాస్పిటళ్లలో అగ్నిప్రమాదాల నివారణతోపాటు పేషెంట్లు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. గురువారం సెక్రటేరియెట్‌‌లో హాస్పిటళ్ల భద్రతా ప్రమాణాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీలపై ఆరా తీశారు.    

సేఫ్టీ గైడ్‌‌లైన్స్‌‌తో జీవో..

హాస్పిటళ్లలో భద్రతా ప్రమాణాల పర్యవేక్షణకు సమగ్ర గైడ్‌‌లైన్స్, స్టాండర్డ్ చెక్‌‌లిస్ట్‌‌తో ప్రత్యేక జీవోను వెంటనే తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఫైర్ అలారాలు, ఎక్స్‌‌టింగ్విషర్లు, స్ప్రింక్లర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఎలక్ట్రికల్ ప్యానెళ్లు, వైరింగ్, డీజీ సెట్లు, ఏసీలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని చెప్పారు. ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్‌‌ఎన్‌‌సీయూ, ఎన్‌‌ఐసీయూ, డయాలసిస్, ఎమర్జెన్సీ వార్డులను సెన్సిటివ్ జోన్లుగా గుర్తించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.  

కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు..

జిల్లా స్థాయిలో ఆడిట్ ప్రక్రియ పక్కాగా అమలయ్యేలా కలెక్టర్ చైర్మన్‌‌గా ఆరోగ్య, విద్యుత్, ఫైర్, ఆర్‌‌అండ్‌‌బీ శాఖల అధికారులతో మల్టీ డిపార్ట్‌‌మెంటల్ కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డీఎంహెచ్‌‌వో, డీఎఫ్‌‌వో, ఎలక్ట్రికల్ ఎస్‌‌ఈ తదితర అధికారులు దవాఖాన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలని సూచించారు.  జిల్లా కమిటీల పనితీరు, రాష్ట్రవ్యాప్తంగా సేఫ్టీ ఆడిట్ పురోగతిని పర్యవేక్షించేందుకు తన అధ్యక్షతన రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందని మంత్రి తెలిపారు.