వృద్ధులు, దివ్యాంగులు ఓటేయాలంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిందే!

వృద్ధులు, దివ్యాంగులు ఓటేయాలంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిందే!
  •     వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి వేసేందుకు అవకాశం కల్పించని రాష్ట్ర ఎన్నికల సంఘం  
  •     2023 అసెంబ్లీ ఎన్నికల్లో కల్పించి..  పంచాయతీ ఎన్నికల్లో ఇవ్వలేదు

యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్​చర్యలు తీసుకుంది. కానీ, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అలాంటి అవకాశం కల్పించలేదు. ఓటు వేయాలంటే ఎవరైనా తప్పనిసరిగా పోలింగ్​కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగుల్లో 40 శాతం వైకల్యానికి మించిన వాళ్లకు ఇంటి నుంచే ఓటు వేసేలా వెలుబాటు కల్పించగా  చాలామంది వినియోగించుకున్నారు. 

ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేదు. పోలింగ్​కేంద్రానికి వెళ్లి ఓటేయాలి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ జరగనుంది. అయితే.. చలికాలం కావడంతో ఉదయమే వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయడం ఇబ్బందిగానే ఉంటుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు అభ్యర్థులకు ఎంతో ముఖ్యం. అదే గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతుంది. దీంతో వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు వాహనాలు సమకూర్చి పోలింగ్​సెంటర్​కు తరలించే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్​ ఏర్పాటు చేస్తామని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.  80 ఏండ్లు దాటిన వృద్ధులు, నడవలేని దివ్యాంగులు సెంటర్​లోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.