జగిత్యాల టౌన్, వెలుగు: ఆస్తుల కోసం వేధిస్తున్న కొడుకు, కోడలిపై తల్లిదండ్రులు జగిత్యాల ఆర్డీవోకు బుధవారం ఫిర్యాదు చేశారు. జగిత్యాలలోని వాణినగర్‌కు చెందిన బట్టు శంకర్–అనసూయ దంపతులు వృద్ధాప్యంతో పాటు అస్తమా, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు. తమ కష్టార్జితంతో కొన్న ఆస్తులను అనుభవిస్తున్న కొడుకు హరీశ్, కోడలు జయ తమకు కనీస వైద్య ఖర్చులు ఇవ్వకుండా, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హింసిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ సహకారంతో బాధితులు ఆర్డీవో మధుసూదన్‌ను ఆశ్రయించగా, ఆయన కేసు నమోదుకు ఆదేశాలిచ్చారు. తమ ఆస్తులను తిరిగి తమ పేరిట మార్పించి, వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తల్లి అనసూయ కన్నీటితో వేడుకున్నారు.

