సింగరేణిలో లాభాల వాటాను వెంటనే చెల్లించాలె

సింగరేణిలో లాభాల వాటాను వెంటనే చెల్లించాలె

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​అమల్లో ఉందనే కారణంతో సింగరేణి ఉద్యోగులకు చెల్లించాల్సిన లాభాల వాటాను మేనేజ్​మెంట్​నిలిపివేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. సోమవారం మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లోని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

కార్మికులు, లీడర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఈనెల 9 నుంచి అమల్లోకి వస్తే.. అంతకంటే ముందే 4వ తేదీనే సింగరేణి ఉద్యోగులకు లాభాల వాటా చెల్లిస్తున్నట్లు మేనేజ్​మెంట్ సర్క్యూలర్​జారీ చేసిందని, దీన్ని అమలు చేయకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యమని మండిపడ్డారు. లాభాల వాటా చెల్లింపు విషయంలో ఎలాంటి కోడ్ అడ్డురాదని, వెంటనే వాటాను చెల్లించాలన్నారు.

లేకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతమని హెచ్చరించారు. ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లతో పాటు మందమర్రిలో టీబీజీకేఎస్​ యూనియన్ ​లీడర్లు సింగరేణి ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచిల సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్(ఏఐటీయూసీ) ప్రదీప్​కుమార్(బీఎంఎస్​), ఎస్​.వెంకటస్వామి, భాగ్యరాజు, బాలాజీ(సీఐటీయూ) తదితరులు పాల్గొన్నారు.