వాట్సప్ లో వికసిత్ భారత్ మెసేజ్​లు ఆపండి : ఎలక్షన్ కమిషన్

వాట్సప్ లో వికసిత్ భారత్ మెసేజ్​లు ఆపండి : ఎలక్షన్ కమిషన్
  • కేంద్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశం 

న్యూఢిల్లీ: వాట్సప్ లో ‘వికసిత్ భారత్’ మెసేజ్ లు పంపడం వెంటనే ఆపాలంటూ కేంద్రాన్ని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశించింది. గురువారం ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఓ రిపోర్టును సమర్పించాలని ఆ శాఖను కోరింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వానికి సంబంధించిన మెసేజ్ లు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని ఈసీ తెలిపింది. 

ఎన్నికల కోడ్ అమల్లోకి రాక ముందు ప్రధాని మోదీ లేఖతో ఉన్న వాట్సప్ మెసేజ్ లను  కేంద్రం  మార్చి 15న పంపింది. ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరిట ఈ మెసేజ్ లు వస్తున్నాయి. దీనిలో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పాలసీలు, పథకాలను ప్రస్తావించింది. వీటిని మరింత మెరుగుపరచడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. నెట్ వర్క్ పరిమితుల కారణంగా ఈ మెసేజ్ లు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆలస్యంగా డెలివరీ అవుతున్నాయని ఈసీకి ఐటీ శాఖ చెప్పింది. అయితే, ఈ మెసేజ్ లపై కాంగ్రెస్, టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 

మోదీ ప్రకటనలపై కాంగ్రెస్ ఫిర్యాదు.. 

‘మోదీ కీ గ్యారంటీ’, ‘మోదీ పరివార్’ ప్రకటనలకు వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. ఈ యాడ్ లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.  గురువారం ఈ మేరకు పార్టీ నేతలు ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్, సుప్రియా శ్రీనతేలతో కూడిన ప్రతినిధుల బృందం ఈసీని కలిసి మెమోరాండం అందజేసింది.