- ఆగస్టు 10 – సెప్టెంబర్ 9 వరకు సవరణలు,
- కొత్త దరఖాస్తులకు చాన్స్.. అక్టోబర్ 12న తుది జాబితా రిలీజ్
- సర్ షెడ్యూల్‌ను సవరించిన ఎన్నికల కమిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్సెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) సవరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ ఆగస్టు 3వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. అనంతరం ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా అధికారికంగా ప్రచురించనున్నారు.
ఈ సవరణల ప్రక్రియపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. వాస్తవానికి ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24తో ఎన్యూమరేషన్ దరఖాస్తుల సేకరణ పూర్తి కావాల్సి ఉంది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రజలు తమ సవరణలు, కొత్త దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించేందుకు అక్టోబర్ 8 వరకు గడువు పొడిగించారు.
అనంతరం సవరణలతో కూడిన తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 12న అధికారికంగా విడుదల చేయనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వాటి డిజిటలైజేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జులై 15 నాటికి అందిన నివేదిక ప్రకారం డిజిటలైజేషన్ ప్రక్రియ 54.84 శాతానికి చేరుకోగా, మొత్తం 1,85,49,163 ఫారాలను కంప్యూటరీకరించారు. ఈ డిజిటలైజేషన్ పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పాత షెడ్యూల్ సవరించిన షెడ్యూల్
బీఎల్‌ఓల ఇంటింటి సర్వే 25.06.2026-24.07.2026 25.06.2026-03.08.2026
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ 24.07.2026 లోగా 03.08.2026 లోగా
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 31.07.2026 10.08.2026
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల
సమర్పణ గడువు 31.07.2026-30.08.2026 10.08.2026 - 09.09.2026
అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31.07.2026-28.09.2026 10.08.2026 - 08.10.2026
తుది ఓటర్ల జాబితా ప్రచురణ 01.10.2026 12.10.2026
