ఫీజుల చట్టంపై మళ్లీ కదలిక..త్వరలో వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఫీజుల నియంత్రణ చట్టం డ్రాఫ్ట్

ఫీజుల చట్టంపై మళ్లీ కదలిక..త్వరలో వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఫీజుల నియంత్రణ చట్టం  డ్రాఫ్ట్
  • పేరెంట్స్, విద్యావేత్తలు, స్టూడెంట్ల నుంచి అభిప్రాయాల సేకరణ 
  • రెండేళ్లకోసారి 8 శాతం ఫీజుల పెంపునకు ప్రతిపాదన 
  • సీఎంవో సెక్రటరీ శ్రీధర్ సమీక్ష.. సీఎం ఆమోదం తర్వాత స్పీడప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేందుకు సర్కారులో మళ్లీ కదలిక మొదలైంది. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. రెండు రోజుల క్రితం సీఎంవో సెక్రటరీ శ్రీధర్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫీజుల కట్టడిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. చట్టం తాలూకు ‘డ్రాఫ్ట్’ను త్వరలోనే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టాలని అధికారులు డిసైడ్ అయ్యారు. 

ఈ డ్రాఫ్ట్‌‌‌‌పై ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని పారదర్శకంగా తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే డ్రాఫ్ట్‌‌‌‌ను వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉంచి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేనేజ్మెంట్లు,  విద్యావేత్తలు, సామాన్య ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించనున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే చట్టానికి ఫైనల్ షేప్ ఇవ్వనున్నారు. మరోపక్క, ప్రస్తుతం స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను అధికారులు సేకరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏ స్కూల్ ఎంత వసూలు చేస్తోందనేది లెక్క తేల్చి, ఆ వివరాలను కూడా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టాలని యోచిస్తున్నారు. 

8 శాతం పెంపు.. అంతకు మించితే ‘అప్పీల్’  

విద్యాశాఖ రూపొందించిన డ్రాఫ్ట్ ప్రకారం.. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు ప్రతి రెండేళ్లకోసారి గరిష్టంగా 8 శాతం వరకు ఫీజు పెంచుకునేలా నిబంధన పెట్టారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ పెంచాలని మేనేజ్మెంట్లు భావిస్తే, దానికి తగిన కారణాలు చూపుతూ జిల్లా ఫీజుల కమిటీకి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేతప్ప ఇష్టారాజ్యంగా వడ్డిస్తే ఊరుకునేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిబంధనల ద్వారా దోపిడీకి అడ్డుకట్ట వేయడమే కాకుండా, విద్యా సంస్థల్లో జవాబుదారీతనం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

మూడంచెల కమిటీలు..  

ఫీజుల నియంత్రణను పక్కాగా అమలు చేసేందుకు డ్రాఫ్ట్‌‌‌‌లో మూడు స్థాయిల కమిటీలను విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించారు. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక పవర్‌‌‌‌ఫుల్ కమిటీ ఉంటుంది. ఇది ఫీజుల నియంత్రణను పర్యవేక్షిస్తుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీలు ఉంటాయి. స్కూళ్లు అదనపు పెంపు కోసం కోరితే ఇవే నిర్ణయం తీసుకుంటాయి. 

ప్రతి స్కూల్‌‌‌‌లోనూ ఒక కమిటీని ఏర్పాటు చేసి, అందులో తల్లిదండ్రులు, టీచర్లకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ఈసారి ఎలాగైనా కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సర్కారు పట్టుదలతో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ డ్రాఫ్ట్ పబ్లిక్ లోకి రానుంది. అయితే, ఈ విషయంపై దాదాపు ఏడు నెలల క్రితం సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేస్తే.. విద్యాశాఖ అధికారులు తీరిగ్గా, ఇప్పుడు రెడీ కావడం గమనార్హం.