కార్డిఫ్: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో దుమ్మురేపిన టీమిండియా రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ఇక్కడే సిరీస్ పట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కీలకమైన ఈ పోరుకు ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. తొలి వన్డేలో 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇది కేవలం కండరాలు పట్టేయడం (క్రాంప్స్) మాత్రమే కావాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత రోహిత్ తన దూకుడు ఆటతీరును కాస్త తగ్గించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి హిట్‌మ్యాన్ 13 వన్డేల్లో 46.91 సగటుతో 563 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలు బాగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం జట్టులో ఉన్న పోటీ దృష్ట్యా రోహిత్ ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాల్సిన ఒత్తిడి నెలకొంది. 39 ఏళ్ల రోహిత్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఇషాన్ కిషన్ వంటి విధ్వంసకర ఆటగాడు అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు. దీనికి భిన్నంగా కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అక్టోబర్ 1, 2025 నుండి కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 77.62 సగటుతో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 621 పరుగులు సాధించి టాప్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో పేసర్ బుమ్రా రీ ఎంట్రీ అద్భుతంగా జరిగింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో కాస్త లయ తప్పినట్లు కనిపించిన బుమ్రా, తిరిగి తన పాత పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఫామ్‌లోకి రావడం కూడా జట్టుకు పెద్ద ఊరటనిస్తోంది. సోఫియా గార్డెన్స్ పిచ్ బౌన్స్‌కు అనుకూలమని సంకేతాల నేపథ్యంలో గుర్నూర్ బ్రార్ ప్లేస్‌లో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. శివమ్ దూబే, సుందర్ ప్లేస్‌లకు ఢోకా లేదు.
ఒత్తిడిలో ఇంగ్లండ్
టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న ఇంగ్లండ్ తొలి వన్డేలో ఫెయిలైంది. దాంతో ఈ మ్యాచ్‌లో వాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. గతేడాది నుంచి ఆడిన 19 వన్డేల్లో 13 మ్యాచ్‌ల్లో ఓడింది. అయితే కార్డిఫ్‌లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 17 మ్యాచ్‌ల్లో 10 గెలిచింది. కేవలం మూడింటిలో మాత్రమే ఓడింది. ఈ రికార్డు ఇంగ్లిష్ టీమ్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం.
రూట్, డాసన్, డకెట్ మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మిడిలార్డర్‌లో బ్రూక్, బట్లర్, సామ్ కరన్ ఫామ్ లేమి ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో ఆర్చర్, టంగ్, కరన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. రన్స్ కట్టడి చేయడంలో ఫెయిలవుతున్నారు. ఆదిల్ రషీద్, జాకబ్ బెథెల్, విల్ జాక్స్ వికెట్లు తీయాల్సి ఉంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సుందర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, గూర్నర్ బ్రార్ / అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, డాసన్, ఆర్చన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
