- ఇప్పటికే 3 వేల ఆర్టీసీ బస్సులను ‘ఎలక్ట్రిక్’గా
- మార్చే ప్రక్రియ మొదలైంది: సీఎం రేవంత్
- కాలుష్యరహిత నగరం కోసం పరిశ్రమలను తరలిస్తం
- 2034 నాటికి అమెజాన్ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని సూచన
- ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీజిల్‌తో నడుస్తున్న సుమారు 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా పర్యావరణహిత ఈవీ ఆటోలుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డీజిల్‌తో నడుస్తున్న 3 వేల ఆర్టీసీ బస్సులను నగరం వెలుపలికి తరలించి, వాటి స్థానంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నివాసయోగ్య నగరంగా మార్చడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో బుధవారం అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో పనిచేస్తోంది. అమెజాన్ సంస్థ రాబోయే 14 ఏండ్లలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలనే ప్రణాళికలు ప్రశంసనీయం. అయినా, రాష్ట్రం నిర్దేశించుకున్న ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనకు అవి సరిపోవని నా అభిప్రాయం.
‘‘అందుకే 2034 నాటికి ఈ ఫ్యూచర్ సిటీలో రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టాలని అమెజాన్ యాజమాన్యాన్ని కోరుతున్నా” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.దేశ జీడీపీలో మన వాటా 10 శాతానికి చేరాలి..నిరుడు డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ విజయవంత మైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూడురోజులపాటు జరిగిన ఈ సదస్సులో దాదాపు 180 దేశాల ప్రతినిధులు, 3 వేల మంది కార్పొరేట్ రం గానికి చెందిన ప్రముఖులు హాజరై పెట్టుబడులపై చర్చించారని గుర్తుచేశారు.
దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో మన రాష్ట్రం ప్రస్తుతం ఏకంగా 5 శాతం కాంట్రిబ్యూషన్ అందిస్తోందన్నారు. ఈ జీడీపీ కాంట్రిబ్యూషన్‌ను భవిష్యత్తులో 10 శాతానికి పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రానికి భారీగా పెట్టు బడులు, మౌలిక వసతులు, ఉపాధి కల్పన ఎంతో అవసరమన్నారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అలాగే, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడానికి కార్పొరేట్ రంగానికి తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
భూములు ఇచ్చే రైతులకు నష్టం జరగనివ్వం
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్ 2047’ పాలసీ తీసుకువచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విధాన పత్రాన్ని రూపొందించడంలో అంతర్జాతీయ స్థాయి నిపు ణులను భాగస్వామ్యం చేశామని వివరించారు. ఇందులో ఐఎస్‌బీ, నీల్సన్‌తోపాటు శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సేవలను వినియోగించుకున్నామని, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్‌లాంటి ఆర్థిక నిపు ణుల సలహాలు కూడా తీసుకున్నామని పేర్కొన్నారు. సింగిల్ విండో విధానంతో పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
పరిశ్రమల కోసమే కాకుండా సరికొత్త పెట్టుబడి, పర్యాటక విధానం, ఎనర్జీ పాలసీ, మెడికల్ అండ్ హెల్త్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ లను రాష్ట్రంలో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఐటీ కంపెనీలు, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి అవసరమైన అత్యుత్తమ రహదారి మౌలిక వసతులను తీర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. భూములు ఇచ్చే రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకుండా తగిన నష్టపరిహారం అందించి, వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులతో స్వయంగా సమావేశమై సమస్యలను సామర స్యపూర్వకంగా చర్చించి, వారిని ఒప్పించి మెప్పించాలని మంత్రి శ్రీధర్ బాబు, కేఎల్ఆర్, మల్‌రెడ్డి రంగారెడ్డిని ఆదేశించినట్టు తెలిపారు. నష్టపోయిన రైతు కుటుంబాల్లోని అర్హులైన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పూర్తి భరోసా ఇస్తామని సీఎం పేర్కొన్నారు.
రూ. 1,500 కోట్ల ఆదాయం పోయినా వెనకడుగు వేయం
నగరంలో ఎవరు ఈవీ వాహనాలు కొనుగోలు చేసినా జీరో టాక్సేషన్ (సున్నా పన్ను) విధానాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ వినూత్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి ఏకంగా రూ. 1,500 కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్పారు. అయినా సరే, ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
పెట్టుబడులకు అవసరమైన అన్ని రకాల అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల పురోగతిపై ప్రతి నెలా స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. ‘‘కాలుష్య కారక పరిశ్రమలను సుదూర ప్రాంతాలకు తరలించడంతో పాటు మూసీ నదిని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాం. నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి మెట్రో రైలు మార్గాలను విస్తరిస్తాం” అని వెల్లడించారు.
