బనకచర్లపై కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..ఏపీ సహా 13 మంది ప్రతివాదులకు సమన్లు

బనకచర్లపై కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..ఏపీ సహా 13 మంది ప్రతివాదులకు సమన్లు
  • 28 రోజుల్లో కోర్టు ముందుకు రావాలని ఆదేశం
  • ఏపీ సహా 13 మంది ప్రతివాదులకు సమన్లు.. 28 రోజుల్లో కోర్టు ముందుకు రావాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టును ఏపీ ఆపేసేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు పాజిటివ్​గా స్పందించింది. మంగళవారం 13 మంది ప్రతివాదులకు సమన్లను జారీ చేసింది. 28 రోజుల్లోగా కోర్టు రిజిస్ట్రీముందు హాజరై తమ రిప్లై ఇవ్వాలని స్పష్టం చేసింది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టును కట్టకుండా ఏపీని నిలువరించాలని కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్​ 25న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సూట్​ దాఖలు చేసింది. 

ఏపీతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర పర్యావరణ శాఖ, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​, ఒడిశా, మధ్యప్రదేశ్, పోలవరం ప్రాజెక్ట్​అథారిటీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు,సెంట్రల్​వాటర్​కమిషన్ ప్రతివాదులుగా ఆ సూట్ మంగళవారం చీఫ్​ జస్టిస్​ సూర్యకాంత్​ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అడ్వకేట్​ ఆన్​ రికార్డ్​తో కోర్టు ముందుకు రావాలని, పిటిషనర్​కు సమాధానమివ్వాలని ప్రతివాదులకు స్పష్టం చేసింది. 

కేసు విచారణకు వచ్చే నాటికి సాక్షులను సిద్ధం చేసుకోవాలని, పిటిషనర్​ చేస్తున్న ఆరోపణలకు మీ దగ్గరున్న డాక్యుమెంట్లనూ సిద్ధం చేసి పెట్టుకోవాలని తెలిపింది. ఒకవేళ గడువులోగా కోర్టు ముందు హాజరుకాకుంటే.. కేసును విచారణకు తీసుకుంటామని తెలిపింది. ప్రతివాదులు గైర్హాజరు అని పేర్కొనాల్సి ఉంటుందని తెలిపింది.