తెలంగాణలో పది వేలు దాటిన MBBS సీట్లు.. కొత్తగా 810 సీట్లు మంజూరు 

తెలంగాణలో పది వేలు దాటిన MBBS సీట్లు.. కొత్తగా 810 సీట్లు మంజూరు 
  • కొత్తగా 810 సీట్లు మంజూరు చేస్తూ సీట్ మాట్రిక్స్ రిలీజ్ చేసిన ఎన్ఎంసీ    
  • గతేడాది రాష్ట్రంలో 9,440 సీట్లు ఉండగా, తాజాగా పెంచిన సీట్లతో 10,250కి చేరిక 
  •     ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా 110 సీట్లు, ప్రైవేట్ లో 700 
  •     ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం 4,400 సీట్లు, ప్రైవేట్ లో 5,850  సీట్లు 
  •     దేశంలోనే అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు ఉన్న 5వ రాష్ట్రంగా తెలంగాణ
  •     దేశవ్యాప్తంగా అందుబాటులోకి 1.36 లక్షల సీట్లు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఈ విద్యా సంవత్సరం పది వేల మార్కును దాటింది. 2026-–27 అకడమిక్ ఇయర్ కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి మొత్తం 10,250 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది వరకు రాష్ట్రంలో మొత్తం 9,440 సీట్లు ఉండగా, ఈసారి కొత్తగా 810 సీట్లను ఎన్ఎంసీ అదనంగా మంజూరు చేసింది. మొత్తం 66 మెడికల్ కాలేజీల ద్వారా ఈ సీట్ల భర్తీ జరగనుంది. పెరిగిన సీట్లలో ప్రభుత్వ వాటా కంటే ప్రైవేటు కాలేజీల వాటానే అధికంగా ఉండటం గమనార్హం.

రాష్ట్రంలో కొత్తగా 810 సీట్లు

ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో నిజామాబాద్, ఆదిలాబాద్ జీఎంసీలలో 30 సీట్ల చొప్పున, సిద్దిపేట, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జీఎంసీలలో 25 సీట్ల చొప్పున పెరిగాయి. ఇక ప్రైవేట్ లో కొత్తగా ఏర్పాటైన రాజరాజేశ్వరి ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మహిళల కాలేజీ)కి 150 సీట్లు కేటాయించగా, పాత కాలేజీలైన మహేశ్వరా (పటాన్‌‌‌‌‌‌‌‌చెరు), ఎంఎన్ఆర్ (సంగారెడ్డి), షాదాన్ (రంగారెడ్డి) మెడికల్ కాలేజీలలో ఒక్కో చోట 100 సీట్ల చొప్పున పెరిగాయి. వీటితో పాటు మల్లారెడ్డి ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ (సురారం), మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీ, మమత అకాడమీ (బాచుపల్లి), ఎస్వీఎస్ (మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్), భాస్కర్ మెడికల్ కాలేజీలలో తలో 50 సీట్లను ఎన్ఎంసీ అదనంగా మంజూరు చేసింది

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో..

రాష్ట్రంలోని 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గతేడాది 4,290 సీట్లు ఉండగా, ఈ విద్యా సంవత్సరంలో మరో 110 సీట్లను అదనంగా పెంచారు. దీంతో ప్రభుత్వ రంగంలో మొత్తం సీట్ల సంఖ్య 4,400కు చేరింది. ఇక ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయానికొస్తే.. 30 కాలేజీల్లో గతంలో 5,150 సీట్లు ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 700 అదనపు సీట్లకు అనుమతి లభించింది. ఫలితంగా ప్రైవేటు రంగంలో మొత్తం సీట్లు 5,850కి పెరిగాయి. మొత్తంగా చూస్తే 9,440 పాత సీట్లకు 810 కొత్త సీట్లు తోడవ్వడంతో తెలంగాణ పది వేల క్లబ్ లోకి చేరింది. తద్వారా వైద్య విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు భారీగా అవకాశాలు పెరిగాయి. 

టాప్ 5లో తెలంగాణ

దేశంలోని కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే 10 వేల ఎంబీబీఎస్ సీట్ల మార్కును దాటాయి. అందులో తెలంగాణ చోటు దక్కించుకోవడం విశేషం. దేశంలోనే అత్యధికంగా కర్నాటకలో 15,395 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 14,000 సీట్లతో ఉత్తరప్రదేశ్, 13,999 సీట్లతో తమిళనాడు, 13,099 సీట్లతో మహారాష్ట్ర ఉన్నాయి. తెలంగాణ 10,250 సీట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 7,465 సీట్లతో పదో స్థానంలో ఉండగా.. గుజరాత్ (7,750), రాజస్థాన్ (8,080) వంటి పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువగా ఉండటం విశేషం.

అదనపు అడ్మిషన్లపై ఎన్ఎంసీ నిఘా

సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఏ కాలేజీ కూడా తనకు మంజూరు చేసిన సీట్ల కంటే అదనంగా ఒక్క విద్యార్థిని కూడా చేర్చుకోవడానికి వీల్లేదని ఎన్ఎంసీ హెచ్చరించింది. అలా జరిగితే ఎన్ఎంసీ చట్టం 2019 కింద భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా కొత్తగా సీట్లు పెరిగిన ప్రైవేటు కాలేజీలు వారం రోజుల్లోగా ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని, అప్పుడే వారికి లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) జారీ చేస్తామని నిబంధన పెట్టింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏవైనా తేడాలు వస్తే కౌన్సెలింగ్ కమిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, సీట్ల మ్యాట్రిక్స్‌‌‌‌‌‌‌‌ ను నిశితంగా పరిశీలించాలని రాష్ట్రాలను ఎన్ఎంసీ ఆదేశించింది. సీట్లు పెరగడంతో తెలంగాణలో కటాఫ్ మార్కులు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు 
భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కొత్తగా 9,911 సీట్లు

దేశవ్యాప్తంగా వైద్య విద్య సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎన్ఎంసీ గణంకాలు చెబుతున్నాయి. ఇండియా మొత్తం మీద 823 మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 1,36,939 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో దేశవ్యాప్తంగా 1,27,028 సీట్లు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 9,911 సీట్లను మంజూరు చేశారు. ఇందులో ప్రభుత్వ కాలేజీల వాటా 63,296 సీట్లు కాగా, ప్రైవేటు కాలేజీల వాటా 73,643 సీట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా పెరిగిన సీట్లలో కేవలం 2,111 సీట్లు మాత్రమే ప్రభుత్వ కాలేజీలకు కేటాయించగా, అత్యధికంగా 7,800 సీట్లను ప్రైవేటు కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతించింది.