ఉచిత హామీలపై రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ

ఉచిత హామీలపై రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ
  • వాటికయ్యే ఖర్చెంత.. ఏడ్నుంచి తెస్తరో కూడా..
  • రాజకీయ పార్టీలకు ఎలక్షన్​ కమిషన్​ లెటర్
  • ఈ నెల 19 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ: ఎన్నికల ముంగట రాజకీయ పార్టీలు చేసే హామీలకు సంబంధించి జవాబుదారీతనం ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మంగళవారం లెటర్​ రాసింది. ఎన్నికల టైమ్​లో ఉచిత  హామీలకు సంబంధించి ప్రకటనలు గుప్పిస్తే సరిపోదని, ఆ హామీలను ఎలా అమలు చేస్తారో కూడా ప్రజలకు వివరించాలని అందులో సూచించింది. దీనిపై కచ్చితమైన సమాచారం ఇవ్వాలని అక్టోబర్ 19వ తేదీలోపు గడువు విధిస్తూ అన్ని రాజకీయ పక్షాలను సీఈసీ కోరింది. రాష్ట్ర, కేంద్ర ఆర్థిక పరిస్థితినీ ఓటర్లకు వివరించాలని, సంక్షేమం, ఉచిత పథకాల అమలుకు అయ్యే ఖర్చెంత, ఆ సొమ్ము ఎక్కడి నుంచి తెస్తరో కూడా చెప్పాలని పేర్కొంది. 

ఉచితం.. సంక్షేమం..
ఏవి ఉచితాలు.. ఏవి సంక్షేమ పథకాలని విడదీసి చెప్పడానికి సరైన ప్రాతిపదిక లేదని ఈసీ గుర్తు చేసింది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్నీ పేర్కొంది. ఈ నేపథ్యంలో హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను ఏదీ అడ్డుకోలేదని, అదేటైమ్​లో పార్టీలు ఇచ్చే హామీలకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకునే హక్కు కూడా ఓటర్లకు ఉందని వివరించింది. ఇందుకోసం ప్రాంతీయ, జాతీయ పార్టీలు తమ హామీలకు సంబంధించి పూర్తి ఫైనాన్స్​ ప్లానింగ్​ రూపొందించి, ఓటర్లకు తెలియజెప్పాలని పేర్కొంది. ఈ వివరాలన్నీ తెలుసుకుని, హామీల సాధ్యాసాధ్యాలను గమనించి ఓటు ఎవరికి వేయాలో  జనం నిర్ణయించుకుంటరని తెలిపింది. ఈ వివరాలన్నీ నిర్ణీత ఫార్మాట్​లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల చీఫ్​ సెక్రెటరీ, కేంద్ర ఆర్థిక కార్యదర్శికి అందజేయాలని కూడా ఎలక్షన్​ కమిషన్​ తన లెటర్​లో సూచించింది.