ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ : కలెక్టర్​ రాజర్షి షా

ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ : కలెక్టర్​ రాజర్షి షా
  • ఎన్నికల నిబంధన ఉల్లంఘించడంతోనే సస్పెన్షన్  
  • మెదక్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా 

మెదక్ టౌన్, వెలుగు : మెదక్​ జిల్లాలో ఎన్నికల కమిషన్​ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా తెలిపారు.  ఆయన మాట్లాడుతూ.. చేగుంట మండలం చందాయిపేట వీఏవో పద్మ, నాగాపూర్​ వీవోఏ యాదగిరితో పాటు పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామ బీసీ బాలుర వసతి గృహ వార్డెన్​ మనోహర్​లను సస్పెండ్​ చేసినట్లు పేర్కొన్నారు. చేగుంట మండలం చందాయిపేలకు చెందిన వీఏవో  పద్మ తన భర్త స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ కండువా కప్పుకొని పార్టీలో చేరినట్లు ఫొటోలతో సహా సీ- విజిల్​ యాప్​లో ఫిర్యాదు అందిందన్నారు.

  దీన్ని డీఆర్​డీవో శ్రీనివాస్​, ఎంపీడీవో, ఏపీఎమ్​, పంచాయతీ కార్యదర్శి, ఎఫ్​ఎస్​టీ సమక్షంలో విచారించారు.  నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో ఆమెను విధుల నుంచి తొలగించామని తెలిపారు. హవేళీ ఘనపూర్​ మండలం నాగాపూర్ వీవోఏ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్లు, మహిళా సంఘాలను ప్రలోభపెడుతున్నట్లు  గ్రామ ప్రజాప్రతినిధులు జిల్లా జనరల్​ అబ్జర్వర్​ పృథ్వీరాజ్​కు  కంప్లైంట్ చేశారు.  

విచారణ చేసిన అధికారులు నివేదికను జిల్లా పరిశీలకులు పృథ్వీరాజ్‌కు అందించారు. దీంతో నాగాపూర్ వీవోఏ యాదగిరిని విధుల నుంచి తొలగించారు.  పాపన్నపేట మండలం కొత్తపల్లి  గ్రామంలోని  ప్రభుత్వ బీసీ బాలుర వసతి  గృహంలో  వార్డెన్ ఎ. మనోహర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందున సస్పెండ్​ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా స్పష్టం చేశారు.