ఆరు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు

ఆరు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు
  • త్రిముఖ పోరుపైనే ఆశ
  • ఓట్లు చీలితే గెలుపు తమదేనన్న ఆలోచనలో రూలింగ్‌‌ పార్టీ ఎమ్మెల్యేలు
  • వ్యతిరేకత పెరుగుతోందన్న వార్తలతో అలర్ట్‌‌ అయిన లీడర్లు
  • కాంగ్రెస్ బలంగా ఉన్న చోట గెలుపుపై అనుమానాలు
  • ఉమ్మడి జిల్లాలోని ఐదారు నియోజకవర్గాలపై ప్రభావం


నల్గొండ, వెలుగు :  ఉమ్మడి నల్గొండ జిల్లా రూలింగ్‌‌ పార్టీ ఎమ్మెల్యేల్లో అప్పుడే ఎలక్షన్‌‌ ఫీవర్‌‌ మొదలైంది. పీకే సర్వేతో హడలెత్తిపోతున్న ఎమ్మెల్యేలు తమ గెలుపోటములపై ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. ఇటీవల పలు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, టీఆర్‌‌ఎస్‌‌ మెయిన్‌‌ లీడర్లు బీజేపీలో చేరారు. వీళ్లతో పాటు పార్టీ కేడర్‌‌ కూడా జారిపోతుండడంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్‌‌ మొదలైంది. దీని నుంచి గట్టెక్కాలంటే వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌‌ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నిజంగానే త్రిముఖ పోటీ ఎదురైతే పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉండొచ్చన్న విషయంపై లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వంతో పాటు, ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత పెరిగిందని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌‌, బీజేపీ పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఎంతో కొంత మెజార్టీతో తామే గట్టెక్కుతామన్న ఆశతో ఉన్నారు. 


ఆరు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు

 

  • ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల త్రిముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నల్గొండ, దేవరకొండ, సూర్యాపేట నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో హుజూర్‌‌నగర్‌‌, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్‌‌ గెలుపొందగా మిగిలిన తొమ్మిది చోట్ల టీఆర్‌‌ఎస్‌‌ గెలిచింది. రెండోసారి టీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో పదవి ఆశించిన పలువురు కాంగ్రెస్‌‌ నాయకులు పార్టీ మారారు. కానీ అక్కడ ఎలాంటి బెర్త్‌‌ లభించకపోవడంతో కొందరు బీజేపీ గూటికి చేరగా.. మరికొందరు తిరిగి కాంగ్రెస్‌‌లోకి యూటర్న్‌‌ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ మధ్యనే పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.

 

  • యాదాద్రి జిల్లా ఆలేరు, భువనగిరిలో టీఆర్ఎస్‌‌ను ఢీకొట్టేందుకు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌ బీజేపీలో చేరగా, జిట్టా బాలకృష్ణారెడ్డి సొంత పార్టీని బీజేపీలో విలీనం చేశారు. దీంతో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ తప్పదని తేలిపోయింది. అయితే జిట్టా భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఈ రెండు చోట్ల గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వీళ్లిద్దరూ రెండో స్థానంలో నిలిచారు. భిక్షమయ్యగౌడ్‌‌ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే డిసైడ్‌‌ అయ్యారు. ఇక జిట్టా సైతం హైకమాండ్‌‌ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. 

 

  • నల్గొండ జిల్లా మునుగోడులో గత ఎన్నికల్లో త్రిముఖ పోటీనే జరిగింది. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్​ గెలిచింది. ఈ సారి టీఆర్‌‌ఎస్‌‌ కొత్త క్యాండిడేట్‌‌ను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ త్రిముఖ పోటీ జరిగితే, రాజగోపాల్‌‌రెడ్డి నిర్ణయంపైనే మునుగోడు భవితవ్యం ఆధారపడి ఉంటుం ది. నల్గొండ నియోజకవర్గంలో గత పార్లమెంట్‌‌ ఎన్నికల్లో బీజేపీకి 18 వేల ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్‌‌లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. ఈ సారి ఇక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాల ని బీజేపీ భావిస్తోంది.  

 

  • సూర్యాపేటలో టీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్​, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. స్వల్ప మెజార్టీతోనే కాంగ్రెస్‌‌ ఓడిపోయింది. మూడో ప్లేస్‌‌లో నిలిచిన బీజేపీకి సుమారు 40 వేల ఓట్లు పోలయ్యాయి. త్రిముఖ పోటీనే ఇక్కడ టీఆర్‌‌ఎస్‌‌ గెలుపునకు దోహదపడింది. మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సీన్‌‌ రిపీట్‌‌ అయితే తమ గెలుపునకు ఢోకా ఉండదని రూలింగ్‌‌ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దేవరకొండలో కాంగ్రెస్‌‌ రెబల్‌‌గా బీల్యానాయక్‌‌ పోటీ చేయడంతో కాంగ్రెస్‌‌ ఓటు బ్యాంకుకు గండిపడింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా చేసేందుకు బీల్యానాయక్‌‌ను టీఆర్‌‌ఎస్‌‌లోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా ముఖ్యనేత డైరెక్షన్‌‌లో ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇదే క్రమంలో బీజేపీ సైతం క్యాండిడేట్‌‌ను మార్చి లాలూనాయక్‌‌ను నిలబెట్టాలని చూస్తోంది. ఈ ఆరు సెగ్మెంట్లలో జరిగే త్రిముఖ పోటీపైనే రూలింగ్‌‌ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది.