ఆగని అమెజాన్‌ లేఆఫ్స్: లగ్జెంబర్గ్ హెడ్‌క్వార్టర్స్‌లో 370 మందిపై వేటు..

ఆగని అమెజాన్‌ లేఆఫ్స్: లగ్జెంబర్గ్ హెడ్‌క్వార్టర్స్‌లో 370 మందిపై వేటు..

ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం 'అమెజాన్' మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. యూరప్‌లోని తన అతిపెద్ద ప్రధాన కార్యాలయం లగ్జెంబర్గ్‌లో భారీగా ఉద్యోగ కోతలను ప్రకటించింది. రాబోయే కొద్ది వారాల్లోనే దాదాపు 370 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ కేంద్రంలో అమెజాన్ చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఉద్యోగ తొలగింపు ఇదే కావడం గమనార్హం.

ప్రస్తుతం లగ్జెంబర్గ్ ఆఫీసులో మొత్తం 4,370 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెజాన్ తాజా నిర్ణయంతో దాదాపు 8.5 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వైపు టెక్ కంపెనీ వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. మానవ వనరుల అవసరం తగ్గుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గత అక్టోబర్ నెలలోనే అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14వేల ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు యూరప్ కేంద్రంలో కూడా ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి.

కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. అలాగే సాధారణ పనులను ఏఐతో భర్తీ చేస్తూ, భవిష్యత్తు సాంకేతికతపై అమెజాన్ దృష్టి సారించింది. ప్రధానంగా మేనేజ్‌మెంట్ స్థానాల్లో ఉన్న లేయర్లను తగ్గించి, సంస్థను మరింత వేగవంతంగా మార్చాలని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో స్టార్టప్ కల్చర్ మాదిరిగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవటంతో పాటు వాటి అమలు వీలవుతుందని ఆయన నమ్ముతున్నారు. 

యూరప్ వంటి ప్రాంతాల్లో కఠినమైన కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ.. అమెజాన్ ఇంత పెద్ద మొత్తంలో తొలగింపులు చేపట్టడం చర్చనీయాంశమైంది. బాధితులకు కంపెనీ నుంచి సెవెరెన్స్ ప్యాకేజీలు, ఇతర ప్రయోజనాలు అందనున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కొనసాగుతున్న ఈ అనిశ్చితి ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పెద్ద టెక్ కంపెనీలన్నీ ఏఐ వైపు మళ్లుతున్న వేళ.. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లో మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.