దేశంలో 7 స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్

దేశంలో 7 స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. పుదుచ్చేరీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అక్టోబర్ 4న పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే బెంగాల్, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి ఒక్కో స్థానం, తమిళనాడు నుంచి రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి కూడా అక్టోబర్ 4నే ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అదే రోజున ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా బీహార్ శాసనమండలి చెందిన ఒక స్థానానికి కూడా అక్టోబర్ 4నే ఉప ఎన్నిక జరగనుంది.

ఈ ఎన్నికకు సంబంధించి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ కు సెప్టెంబర్ 22 తుది గడువుగా నిర్ణయించారు. విత్ డ్రాయల్ కు సెప్టెంబర్ 27 వరకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి.. ఆ వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

బెంగాల్ నుంచి మానస్ రంజన్ భూనియా, అస్సాం నుంచి బిస్వజిత్ దైమరి, మధ్యప్రదేశ్ నుంచి థావర్ చంద్ గెహ్లాట్, తమిళనాడు నుంచి కేపీ మునుస్వామి మరియు వైతిలింగం  రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. కాగా.. మహారాష్ట్రలో మాత్రం రాజీవ్ శంకర్ రావు మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. వీరిలో ఒకరికి మరో సంవత్పరం పాటు పదవీకాల సమయం ఉండగా.. మరి కొంతమందికి మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు పదవీకాల సమయం ఉండటం గమనార్హం.