ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే క్రిమినల్ కేసులు : వికాస్ రాజ్

ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే క్రిమినల్ కేసులు : వికాస్ రాజ్
  • ఎలక్షన్ డ్యూటీలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
  • మునుగోడులో బైపోల్ ఏర్పాట్లపై సమీక్ష

చండూరు/మునుగోడు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని లీడర్లకు స్పష్టం చేశారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి బైపోల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తర్వాత చండూరులో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎన్నికల జనరల్ అబ్జర్వర్, ఇతర ఎన్నికల అధికారులతో రివ్యూ నిర్వహించారు. మూడు ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్‌‌లను ఏర్పాటు చేయడమే కాకుండా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా, డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని వికాస్‌‌రాజ్ తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 3300 ద్వారా సమాచారం అందించాలని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మునుగోడు మండల కేంద్రంతో పాటు పలివెల, గూడాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో  వికాస్ రాజ్ పరిశీలించారు. ముడుపుగూడెంలో కొంత మందితో మాట్లాడారు. ఓటు హక్కు ఉన్నదా, పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయా.. అంటూ అడిగి తెలుసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లపై చర్యలు ఉంటాయని తెలిపారు. తర్వాత జమస్తాన్ పల్లిలో ఫ్లయింగ్ స్వ్కాడ్‌‌తో మాట్లాడారు. ఓటర్లకు స్లిప్పులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. దివ్యాంగులు ఓటు వేయడానికి ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.