లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అమలుపై సచివాలయంలో ఆమె ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.‘‘ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేక కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేయాలి.
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. నిఘా పెంచాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ శాఖలు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశాయి. వాటిలో 444 పోలీస్ శాఖవి, 9 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నాయి. పోలీస్‌శాఖ పెద్దమొత్తంలో నగదు, లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మద్యం, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. రవాణాశాఖ ద్వారా 15 చెక్‌పోస్టులు, 52 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, వాణిజ్యపన్నుల శాఖ ద్వారా 16 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి, 31 కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ చెక్‌పోస్టులు 24 గంటలూ పనిచేయాలి. ఆబ్కారీ శాఖ ఏర్పాటు చేసిన 21 అంతర్రాష్ట్ర, 6 మొబైల్ చెక్‌పోస్టుల ద్వారా అక్రమ మద్యం తయారీకి అవకాశం ఉన్న 8 జిల్లాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
మద్యం అక్రమ రవాణాకు అవకాశమున్న 5 రైలుమార్గాల్లోనూ నిఘాను విస్తృతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి మద్యం సరఫరాను పర్యవేక్షించాలి. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి కూడా మద్యం రవాణాను పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, పీసీసీఎఫ్ ఆర్.ఎం.దోబ్రియాల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్కే జైన్, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఆబ్కారీశాఖ కమిషనర్ శ్రీధర్, సమాచార పారసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
