ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

టీఎస్‌ఆర్‌టీసీ కి చెందిన ఎలక్ట్రికల్ ఎసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం ఉదయం శంషాబాద్ నుంచి జేబీఎస్ వెళుతున్న బస్సు నుండి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు నిలిపాడు. బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు దిగి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. వెంటనే బస్సు సిబ్బంది అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మంటల్లో బస్సు పాక్షికంగా దెబ్బతిన్నది. సాంకేతిక లోపంతో బస్సులో మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఇక రోడ్డుపై బస్సు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

కాగా, తెలంగాణ ఆర్టీసీ పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులను నడిపేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు 40 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి.