
గచ్చిబౌలి, వెలుగు: మిస్‌వరల్డ్ పోటీల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెయిన్‌రోడ్డు వెంట అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్స్ ను తొలగిస్తుండగా ఓ యువకుడికి కరెంట్‌షాక్ తగిలింది. దీంతో అతని శరీరం 40 శాతం కాలి పోయింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం రుంకు హనుమంతపురానికి చెందిన వై.
ఉపేందర్(23) కొంతకాలంగా సిటీలోని మూసాపేట పరిధి ప్రగతినగర్కాలనీలో ఉంటున్నాడు. మూడేండ్లుగా టీజీఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్, ఎలక్ట్రికల్ వర్కర్ గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు అన్ని శాఖల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ ఉన్నతాధికారులు మెయిన్‌రోడ్ల వెంట అస్తవ్యస్తంగా ఉన్న ఇంటర్నెట్, కరెంట్, టెలిఫోన్వైర్లను తొలగించాలని ఆదేశించారు.
శుక్రవారం మధ్యా హ్నం గచ్చిబౌలి ఫ్లై ఓవర్ సమీపంలోని జీప్ షోరూం వద్ద విద్యుత్ కాంట్రాక్టర్ తన సిబ్బందితో కేబుల్స్ తొలగింపు చేపట్టారు. ఉపేందర్ ఆ పనిలో ఉండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడినఅతడిని తోటి కార్మికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఉపేందర్రెండు చేతులు, తల, కుడి కాలికి 40 శాతం గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.