కరెంటు చార్జీలను తగ్గించాల్సిందే

కరెంటు చార్జీలను తగ్గించాల్సిందే
  • రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన బీజేపీ శ్రేణులు
  • నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు
  • సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం

నెట్‌‌వర్క్, వెలుగు: కరెంట్​ చార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్రమంతటా బీజేపీ శ్రేణులు కదం తొక్కాయి. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశాయి. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. సీఎం కేసీఆర్‌‌‌‌కు వ్యతిరేకంగా, టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. కొన్నిచోట్ల ముందస్తుగా బీజేపీ లీడర్లను అదుపులోకి తీసుకోగా, మరికొన్ని చోట్ల లీడర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
హైదరాబాద్​లోని ఖైరతాబాద్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. పీజేఆర్ విగ్రహం ఎదుట లాంతర్లతో బైఠాయించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. బీజేపీ హైదరాబాద్​ అధ్యక్షుడు గౌతంరావు, పార్టీ నేతలు దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌‌‌‌లో ట్రాన్స్​కో ఎస్ఈ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. చార్జీలను వెంటనే తగ్గించాలని పార్టీ కరీంనగర్​జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్‌‌లలో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సిరిసిల్లలో పాత బస్టాండ్ నుంచి సెస్ భవన్ వరకు ర్యాలీ తీశారు. సెస్ భవన్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆదిలాబాద్‌‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.  మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆసిఫాబాద్‌‌లో మెయిన్​రోడ్డుపై రాస్తారోకో, ధర్నా చేశారు. నిజామాబాద్‌‌లోని ట్రాన్స్ కో ఎస్ఈ ఆఫీస్​వద్ద ధర్నా చేశారు. చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని ఎస్ఈకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీఎల్​నర్సయ్య మెమోరాండం ఇచ్చారు. కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో, జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడప్​గల్​లో ధర్నా చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలలో ర్యాలీలు, ధర్నాలు చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. హనుమకొండ, జనగామ, ములుగు, జయశంకర్​భూపాలపల్లి , మహబూబాబాద్​ జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేశారు. హనుమకొండలోని అమర వీరుల స్థూపం నుంచి నక్కలగుట్టలోని ఎన్ పీడీసీఎల్ ఆఫీస్​వరకు ర్యాలీ తీసి..  మెయిన్​గేట్​ఎదుట ఆందోళన చేపట్టారు. ములుగులో సీఎం కేసీఆర్​దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి.. దహనం చేశారు.

నల్గొండలో ఉద్రిక్తత
విద్యుత్ ​చార్జీల పెంపునకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ ఆఫీసు నుంచి ర్యాలీ చేసి, కలెక్టరేట్ ఎదుట లీడర్లు బైఠాయించారు. కొందరు బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు  ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సరిత చేతికి గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో లాంతర్లతో నిరసన దీక్ష చేశారు. సూర్యాపేట, పెన్ పహాడ్, ఆత్మకూర్(ఎస్), తుంగతుర్తి, నాగారం, నూతన్ కల్ మండలాల్లో బీజేపీ లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్​చేశారు. సిద్దిపేటలోని ముస్తాబాద్‌‌‌‌ చౌరస్తా నుంచి ఊరేగింపుగా వచ్చి ట్రాన్స్​కో ఎస్ఈ ఆఫీస్​ఎదుట నేతలు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు  అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌‌‌‌ రెడ్డి గాయపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట, సంగారెడ్డిల్లో నిరసనలు జరిగాయి. మహబూబ్‌‌నగర్ ఎస్ఈ ఆఫీస్​ముందు ధర్నా చేశారు. చార్జీలు పెంచబోమని చెప్పిన కేసీఆర్.. మాట తప్పారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి మండిపడ్డారు. నాగర్ కర్నూల్, నారాయణపేటల్లోనూ ధర్నాలు జరిగాయి.