కరెంట్ మీటర్లు గిర్రాగిర్రా..! తీవ్ర ఎండలు, వడగాడ్పులకు హైదరాబాద్ లో పెరిగిన ఏసీ, కూలర్ల వాడకం.. 

కరెంట్ మీటర్లు గిర్రాగిర్రా..! తీవ్ర ఎండలు, వడగాడ్పులకు హైదరాబాద్ లో పెరిగిన ఏసీ, కూలర్ల వాడకం.. 
  • జీహెచ్ఎంసీలో రికార్డ్ స్థాయిలో విద్యుత్​ వినియోగం
  • 20% గృహజ్యోతి ఇండ్లలో 200 యూనిట్లు దాటిన కరెంట్ బిల్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎండలకు కాలు బయటపెట్టాలంటే జనం వణికిపోతున్నారు.  హీట్​వేవ్స్​ కారణంగా ఉదయం 10 గంటలు దాటితే వేడి గాలులతో ఇంట్లోఉన్నా ఉక్కపోత. ఫ్యాన్లు వేసుకున్నా వేడి గాలులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఏసీలు, కూలర్లు వేయనిదే ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి. రాత్రి పగలు తేడా లేకుండా కూలర్లు విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాయి.

మధ్య తరగతి ప్రజలు సైతం ఏసీలను నాన్​స్టాప్​గా వాడుతున్నారు. పెద్ద, పెద్ద షాపింగ్​ మాల్స్, హాస్పిటల్స్, కార్పొరేట్​ఆఫీస్ లు  రోజంతా సెంట్రల్​ ఏసీలను నడుపుతున్నాయి. దీంతో కరెంట్​మీటర్లు గిరా గిరా తిరుగుతున్నాయి. గ్రేటర్​ హైదరాబాద్​లో కరెంట్​వాడకం ఆల్​ టైమ్​ రికార్డులను తిరగరాస్తున్నది. వ్యవసాయ కరెంట్​ వినియోగం తగ్గినా గత ఏడాదితో పోల్చితే మే నెలలో అత్యధికంగా విద్యుత్​ వాడకం నమోదవుతున్నట్టు ప్రభుత్వ రిపోర్టులు చెబుతున్నాయి.  

గతేడాది కంటే ఈ సారి ఏకంగా 2 వేల మెగావాట్లకు పైగా విద్యుత్​ వినియోగం పెరిగినట్టు కరెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఊర్లలో డొమెస్టిక్​ కరెంట్​ వాడకం పెరిగింది. దీంతో ఈ నెలలో గృహజ్యోతి స్కీమ్​లో ఫ్రీగా వచ్చే200 యూనిట్లకు మించి కరెంట్​ వినియోగించినవాళ్లు ఇప్పటికే 20 శాతం దాటిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో వీరంతా ఈ నెలలో కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తున్నదని అంటున్నారు. 

జీహెచ్ఎంసీలో రికార్డ్ స్థాయిలో కరెంట్​ వినియోగం!

రాష్ట్రంలో 18,222 మెగావాట్ల ఆల్​టైమ్​ రికార్డు మార్చి నెలలోనే నమోదైంది. ఆ టైమ్​లో వ్యవసాయ పంటలకు విద్యుత్​ సప్లయ్​ జరిగేది. పంటలు పూర్తికావడంతో మే నెలలో వ్యవసాయానికి కరెంట్​ డిమాండ్​ 90 శాతానికి పైగా తగ్గింది. ఇప్పుడు రాష్ట్రంలో సగటున కేవలం 11,657 మెగావాట్ల విద్యుత్​ డిమాండ్​ మాత్రమే ఉన్నది. అయితే ఇదే టైమ్​లో గ్రేటర్​ హైదరాబాద్​పరిధిలో రికార్డు స్థాయిలో కరెంట్​వినియోగం జరుగుతున్నది. విద్యుత్​ వినియోగంలో గడిచిన నాలుగు రోజుల్లో రెండు సార్లు ఆల్​ టైమ్​ రికార్డు బ్రేక్ అయింది. 

మే 21న నమోదైన గరిష్ట విద్యుత్​ డిమాండ్ 4,766 మెగావాట్లు కాగా.. విద్యుత్ వినియోగం 100.83 మిలియన్ యూనిట్లకు చేరి గత రికార్డులను అధిగమించింది. ఆ రికార్డును ఒక్క రోజులోనే తిరగరాయాల్సి వచ్చింది. మే 22వ తేదీ మధ్యాహ్నం 3:33 గంటలకు జీహెచ్​ఎంసీ పరిధిలో 4,782 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు కాగా విద్యుత్ వినియోగం 101.07 మిలియన్ యూనిట్లకు చేరుకొని కొత్త రికార్డు క్రియేట్​ చేసింది. 

గ్రేటర్​ హైదరాబాద్​లో కార్పొరేట్, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద, పెద్ద అపార్ట్​మెంట్లు, గేటెడ్​ కమ్యూనిటీలు, విల్లాల్లో నివసించే వాళ్లు అధికంగా ఉన్నారు. దీంతో ఎండ వేడిని తట్టుకోలేక రోజంతా ఏసీలను ఉపయోగిస్తున్నారు. దీంతో డొమిస్టిక్​ కరెంట్​ వినియోగం గత నెలతో పోల్చితే 30 శాతానికి పైగా పెరిగినట్లుగా విద్యుత్  ఇంజినీర్లు తెలిపారు. 

గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెరిగిన విద్యుత్​ వినియోగం

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన ఎండ, వేడిగాలులు వీస్తున్నాయి. ఉక్కపోతను తట్టుకోలేక జనం ఎక్కువగా ఏసీలు, కూలర్లను ఉపయోగిస్తున్నారు. రోజంతా ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. దీంతో గ్రామాలు మున్సిపాలిటీల్లో విద్యుత్​ వినియోగం విపరీతంగా పెరిగింది. గతేడాది ఇదే టైమ్​లో అత్యధికంగా 10,803 మెగావాట్లు, అత్యల్పంగా 7,903 మెగావాట్లు డిమాండ్​ ఉండగా సగటు విద్యుత్​ డిమాండ్​ 9,583 మెగావాట్లకు చేరుకున్నది. 

అయితే ఈ  మే నెలలో గరిష్ట విద్యుత్​ డిమాండ్​ 12,261 మెగావాట్లు కాగా కనిష్ట విద్యుత్​ డిమాండ్​11,053 మెగావాట్లు, సగటున ఈ నెలలో 11,657 మెగావాట్లు నమోదైనట్లుగా విద్యుత్​ శాఖ ఆఫీసర్లు వెల్లడించారు. సాధారణంగా అయితే గడిచిన పదేండ్ల రికార్డులను పరిశీలిస్తే ఏటేటా వెయ్యి మెగావాట్ల విద్యుత్​ డిమాండ్ పెరగడం సర్వసాధారణం. అయితే మే నెలలో ఒకే సారి 2 వేల మెగావాట్లకు పెరగడం అనేది హీట్​ వేవ్స్​ వల్లే జరిగిందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ సారి బిల్లు కట్టాల్సి రావొచ్చు!

ఊళ్లల్లో డొమెస్టిక్​ కరెంట్​ వాడకం పెరగడంతో ఈ నెలలో గృహజ్యోతి స్కీమ్​లో ఫ్రీ గా వచ్చే200 యూనిట్లకు మించి కరెంట్​ వినియోగించినవాళ్లు ఇప్పటికే 20 శాతం దాటిపోయినట్లుగా ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్​ పొందే లబ్ధిదారులు 52.82 లక్షల మంది ఉండగా మే నెలలో కేవలం 40 లక్షల మందికే ఫ్రీ కరెంట్​ బిల్లులు వస్తాయని అంటున్నారు. దీంతో 200 యూనిట్లు దాటిన వారంతా ఈ నెలలో కరెంట్ బిల్లులు కట్టాల్సి రావొచ్చని అంటున్నారు.