- రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటు చేస్తామన్న సర్కారు ఆలోచనపై విద్యుత్ ఉద్యోగులు గళమెత్తారు. ఆలోచించకుండా డిస్కం పెడితే ఇబ్బందులు ఎదురవుతాయని, పునః పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నేతలు హైదరాబాద్‌లో టీజీ జెన్‌కో, ఎస్పీడీసీఎల్ సీఎండీలను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా జేఏసీ ప్రెసిడెంట్సాయిబాబు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో మార్పులకు తాము వ్యతిరేకం కాదని, కానీ అవి పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పారు. ‘‘కొత్త డిస్కం పెడితే క్రాస్ సబ్సిడీ సంగతేంది? సర్కారు నుంచి రావాల్సిన బకాయిల మాటేంది? అసలు పాత డిస్కంల ఆర్థిక పరిస్థితి ఏమైతది? ఇవన్నీ క్షుణ్ణంగా చర్చించకుండా ముందడుగు వేయొద్దు” అని హెచ్చరించారు. విద్యుత్ చట్టం-2023 నిబంధనలకు లోబడి, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా, ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేశారు.
జీతాల సవరణ కమిటీ ఏది?
విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టిజన్ల వేతన సవరణ (పీఆర్సీ) గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుందని జేఏసీ గుర్తు చేసింది. ‘‘వచ్చే నెలకు గడువు అయిపోతున్నా.. ఇప్పటిదాకా 2026 వేతన సవరణ కోసం సంప్రదింపుల కమిటీని ఎందుకు వేయలేదు?”అని నిలదీశారు. వెంటనే కమిటీని ఏర్పాటు చేసి చర్చలు మొదలుపెట్టాలని సీఎండీలను కోరారు.
