
హైదరాబాద్, వెలుగు : నెలాఖరులోగా విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని, లేకుంటే ఉద్యమం తప్పదని విద్యుత్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఫిబ్రవరి 2న విద్యుత్ సౌధ వద్ద నల్ల బ్యాడ్జీలతో ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిసి పీఆర్సీ ఖరారు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల వేతన ఒప్పందం గత ఏడాది మార్చి 31న ముగిసినా ఇప్పటి వరకు కొత్త పీఆర్సీ అమలు చేయడం లేదన్నారు. 10 నెలలు జాప్యం జరగడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీతో పాటు, పెండింగ్‌లో ఉన్న 1999–2004 మధ్యకాలంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్ చేయాలనే డిమాండ్లపై ఆందోళనలకు సిద్ధం కావాలని నిర్ణయించారు.