- 18 సర్కిళ్లలో ఆరు దశల్లో ప్రత్యేక కార్యాచరణ
- భారీ వర్షాలు, ఈదురుగాలులపై ముందస్తు వ్యూహం
- ఏఐ, డ్రోన్లతో ప్రమాదాలు ముందుగానే అంచనా
- ప్రతి సర్కిల్‌లో ఎమర్జెన్సీ రీస్టోర్ టీమ్ వాహనాలు
- నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యమంటున్న సీఎండీ వరుణ్ రెడ్డి
భారీ వర్షాలు, ఈదురుగాలులు వంటి సమయాల్లో విద్యుత్ అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లలో ‘హైపర్’ పేరుతో ఆరు దశల ప్రణాళికను అమలు చేస్తూ, ఏఐ టెక్నాలజీ, డ్రోన్లు, ఎమర్జెన్సీ రీస్టోర్ టీమ్‌ల సాయంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణను మరింత వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హనుమకొండ, వెలుగు: రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా, ప్రకృతి వైపరీత్యాల్లోనూ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లలో ‘హైపర్’ అనే ఆరంచెల ప్రత్యేక ప్రణాళికను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఇందులో హెడ్ క్వార్టర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ(సిబ్బంది హెడ్ క్వార్టర్లో నిరంతరం అప్రమత్తంగా ఉండటం), అరెంజ్మెంట్స్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ మెటీరియల్(అవసరమైన సిబ్బంది, సామగ్రిని ముందుగానే సమీకరించుకోవడం), ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అండ్ ప్రాంప్ట్ ఇంటిమేషన్(విద్యుత్ అంతరాయాలపై కచ్చితమైన సమాచార సేకరణ, వేగంగా చేరవేయడం), ప్లానింగ్ అండ్ మొబిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్(క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం), ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్(కార్యాచరణను వేగంగా అమలు చేయడం), రిస్టోరేషన్ ఆఫ్ పవర్ సప్లై(విద్యుత్ సరఫరాను నిర్దేశిత సమయంలో పునరుద్ధరించడం) అనే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లేలా చర్యలు చేపడుతున్నారు.
ఏఐ టెక్నాలజీతో సేవలు..
టీజీ ఎన్పీడీసీఎల్ ను స్కాడా, జీఐఎస్, ఓఎంఎస్ వంటి ఏఐ టెక్నాలజీతో అనుసంధానం చేశామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. వీటి ద్వారా ఫీడర్లలో వచ్చే సమస్యలను 7 నుంచి 21 రోజుల ముందే అంచనా వేయవచ్చన్నారు. విద్యుత్ డిమాండ్ ను ముందే ఊహించి సరఫరా చేయవచ్చని, లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
భారీ వర్షాల వల్ల ఏర్పడే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ప్రతి సర్కిల్ లో ఎమర్జెన్సీ రీస్టోర్ టీం(ఈఆర్టీ) వెహికల్ ను అందుబాటులో ఉంచుతున్నట్లు సీఎండీ చెప్పారు. ఈఆర్టీ వెహికల్స్ జీపీఆర్ఎస్ తో కనెక్ట్ అయి ఉంటాయని, బాధితుల లొకేషన్ ను వేగంగా గుర్తించడంతో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. పటిష్ట వ్యూహాలతో వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎండీ వరుణ్ రెడ్డి వివరించారు.
