తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో మూడు రోజుల కింద గల్లంతైన ఘట్‌కేసర్ మండలం కొండాపూర్‌కు చెందిన పీట్ల తిమ్మయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్నేహితులతో కలిసి స్నానానికి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యాడు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు.
శుక్రవారం ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎస్పీ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ డీడీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు జంపన్న వాగులోని 9 కిలోమీటర్ల పరిధిలో విస్తృతంగా గాలిస్తున్నాయని తెలిపారు. ఇసుక మేటలో చిక్కుకుని ఉండవచ్చనే అనుమానంతో సిబ్బంది వాగులోకి దిగి పరిశీలిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు వాగులు, నదుల్లోకి దిగవద్దని, ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
