చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గంగవరం మండలం కల్లుపల్లి అటవీ ప్రాంతం సమీపంలో పొలాల్లో ఓ ఏనుగు మృతి చెంది పడి ఉండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు.
కల్లుపల్లి సమీపంలోని ఈశ్వరయ్య అనే రైతు పంట పొలంలో ఏనుగు చనిపోయి పడిఉన్నట్లు స్థానికులు తెలిపారు. గజరాజును కరెంటు పెట్టి చంపేశారా లేదా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయిందా లేక అనారోగ్య కారణాల వలన మృతి చెందిందా అనే విషయాలు అటవీ శాఖ అధికారులు తెలియజేయాల్సి ఉంది.
గతంలో కూడా పలమనేరు నియోజకవర్గ కౌండిన్య అటవీ పరిధిలో కొన్ని ఏనుగులు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ వలన చనిపోవడం జరిగింది. మరోసారి అటువంటి ఘటన జరగటంతో అధికారులు విచారణ మొదలుపెట్టారు.
చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగులు తరచుగా దాడి చేస్తున్నాయి. గ్రామాల్లోకి వస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పంట నష్టం జరుగుతుందని కరెంటు షాక్ పెట్టి చంపేశారా..? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
