హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మేఘా ఇంజినీరింగ్కంపెనీ చేసిన అన్ని పనులపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టులన్నీ వెనక్కి తీసుకొని బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. రూ.432.45 కోట్లకు ఆర్బీఐ గైడ్‌లైన్స్ లో లేని విదేశీ బ్యాంక్ గ్యారంటీ చూపించిన మేఘా కృష్ణారెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
సుంకిశాల ప్రాజెక్టు ఘటనకు ఆ సంస్థే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కావాలనే ఈ విషయం బయటకు రాకుండా చేసిందన్నారు. మేఘా సంస్థను కాపాడేందుకు గత పాలకులతో పాటు ప్రస్తుత పాలకులూ ప్రయతిస్తున్నారని ఏలేటి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సుంకిశాల ప్రాజెక్టు ఘటనలో మేఘా ఇంజనీరింగ్ సంస్థది ముమ్మాటికీ క్రిమినల్ నెగ్లిజెన్స్అని అన్నారు. గతంలో ఆ సంస్థ నాసిరకం పనులు చేస్తోందని గుర్తించిన కేంద్రం.. షోకాజ్ నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. కాళేశ్వరంలో నాసిరకం పనులు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని.. అయినా, రాష్ట్ర ప్రభుత్వం అమృత్ స్కీం ను కూడా మేఘా కంపెనీకే ఎందుకు ఇచ్చిందని ఏలేటి నిలదీశారు. ప్రజాధనం, ప్రజల ప్రాణాలతో రాష్ట్ర సర్కార్, మేఘా కంపెనీ ఆటలాడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రమాదాన్ని ఎందుకు బయటపెట్టలేదు?
సుంకిశాల ప్రాజెక్టులో ఈ నెల2న ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగితే.. ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఘటన జరిగినట్టు ప్రభుత్వానికి మేఘా కంపెనీ సమాచారం ఇచ్చిందా? లేదా? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ఘటన జరిగిన వారం రోజులకు, అదీ మీడియా బయట పెట్టిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని తెలిపారు.
సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌చేశారు. కాళేశ్వరం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విచారణను ఉద్దేశపూర్వకంగానే నీరు గారుస్తోందన్నారు. కంపెనీపై చర్యలు తీసుకోకుంటే ప్రజలతో కలిసి ఆందోళనకు సిద్ధమని ఆయన హెచ్చరించారు. కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రజల సొమ్మును ఆయన దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆయన బండారం బయటపెడ్తానన్నారు.
