- తహసీల్దార్‌పై అసహనం వ్యక్తం చేసిన జేసీ
ఝరాసంగం,వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్ట్ కోసం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో 195 ఎకరాల భూమిని రెండో విడతలో సేకరించడానికి ప్రభుత్వం గతేడాది జులై 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదు నెలల తర్వాత డిసెంబర్ 23న రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామ సభ నిర్వహించారు.
మొదటి విడతలో దాదాపు గ్రామానికి చెందిన 1800 ఎకరాల భూమిని ఇచ్చామని మిగిలిన కొద్దిపాటి భూమి సారవంతమైందని, మూడు పంటలు పండే భూమిని ఇచ్చే ప్రసక్తే లేదని భూమి కోల్పోతున్న రైతులు, రైతు కూలీలు ముక్త కంఠంతో చెప్పారు. చేసేదేమిలేక అధికారులు వెనుదిరిగారు.
ఈ క్రమంలో ఎల్గోయి గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయానికి జాయింట్ కలెక్టర్ వస్తుందనే విషయాన్ని తెలుసుకుని శనివారం కార్యాలయం ముందు రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్ రద్దుచేయాలని ఆందోళన చేపట్టారు.195 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్‌పై అసహనం వ్యక్తం చేసిన జేసీ
నిమ్జ్ రెండో విడత భూసేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఆనే విషయాన్ని పరిశీలించడానికి సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ మాధురి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ముందుగా గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులను మాత్రమే పిలవండి వారితో మాట్లాడుదాం అని తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. ఎల్గోయి గ్రామానికి చెందిన రైతులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చి కార్యాలయం ముందు అందోళన చేపట్టారు.
అంతలోనే జేసీ రావడంతో కార్యాలయం ముందు రైతుల నిరసనను చూసి తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే వెళ్లిపోయారు. బిడకన్నె గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు ఏండ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా తన సమస్యను పరిష్కరించడంలేదని మీరైనా పరిష్కరించాలని జేసీ కాళ్లపై పడబోగా సిబ్బంది అడ్డుకున్నారు.
మేదపల్లి గ్రామానికి చెందిన నర్సింలు మండలంలో అనుమతి లేకుండా ప్రైవేట్ వెంచర్లకు ఎర్రమట్టి తరలిస్తున్నా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని మాముళ్లు తీసుకుని వారికి సహకరిస్తున్నారని,రిజిస్ట్రేషన్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని వెంటనే తహసీల్దార్‌ను బదిలీ చేయాలని జేసీకి వివరించారు.
అనంతరం ఆర్డీఓ దేవుజా, నిమ్జ్స్పెషల్ డిప్యూటి కలెక్టర్ విశాలాక్షిని కలిసి ఇప్పటికే సేకరించిన భూమికి 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులకు, రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని కోరారు.
