మస్క్ను కోర్టుకీడ్చుతున్న ట్విట్టర్ ఉద్యోగులు

మస్క్ను కోర్టుకీడ్చుతున్న ట్విట్టర్ ఉద్యోగులు

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చిక్కుల్లో పడ్డారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాంను చేజిక్కించుకున్న నాటి నుంచి ఆయన నిర్ణయాలతో సతమతమవుతున్న ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. తమను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు హక్కుల్ని కాలరాస్తున్నాడంటూ మస్క్ను కోర్టుకీడ్చుతున్నారు. ట్విట్టర్లో సగం మంది ఉద్యోగుల్ని తొలగించడంపై ఆగ్రహంతో ఉన్న వారంతా వివిధ కారణాలతో కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు.. చట్టాన్ని అతిక్రమించి ఆఫీసు స్పేస్ను బెడ్రూంలుగా మార్చి ఉద్యోగులు ఇంటికి వెళ్లకుండా చేస్తున్నారని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అఫీషియల్స్కు కంప్లైంట్ చేశారు. చట్టంతో తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ ఉద్యోగుల హక్కుల్ని కాలరాసేలా ఎలాన్ మస్క్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఉద్యోగం నుంచి తొలగించిన వారికిచ్చే పరిహారం విషయంలోనూ చాలా మంది కోర్టును ఆశ్రయించారు. మాజీ ఉద్యోగులకు ఇచ్చే బోనస్, స్టాక్ ఆప్షన్, ఎగ్జిట్ ప్యాకేజ్ విషయంలో మస్క్ వైఖరి సరిగా లేదన్నది వారి ఆరోపణ. తన హార్డ్ కోర్ వర్క్ పాలసీకి ఓకే చెప్పని పక్షంలో 3 నెలల జీతం తీసుకొని సంస్థ నుంచి వెళ్లిపోవాలన్న మస్క్ నిర్ణయాన్ని కొందరు ఉద్యోగులు కోర్టులో సవాల్ చేసారు. ఇక వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తిపలికి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని, దివ్యాంగులైన ఉద్యోగుల్ని సైతం కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశించడంపైనా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇది వారి పట్ల వివక్ష చూపడమే అవుతుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.