ట్విట్టర్లో 75 శాతం ఉద్యోగుల్ని తొలగించనున్న ఎలాన్ మస్క్!

ట్విట్టర్లో 75 శాతం ఉద్యోగుల్ని తొలగించనున్న ఎలాన్ మస్క్!

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకుంటే భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత ఉంటుందని వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. ట్విట్టర్ లో ప్రస్తుతం పనిచేస్తున్న  7,400మంది ఉద్యోగుల్లో 75 శాతం మందిని జాబ్ నుంచి తొలగించే అవకాశముందని చెప్పింది. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం సమయంలోనే ఎలాన్ మస్క్ మిగతా పెట్టుబడిదారులకు ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లుతెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల కంపెనీ ఆర్థికంగా పరిపుష్ఠమవుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 

కొత్త నియామకాల్ని వాయిదా వేసిన ట్విట్టర్.. ప్రస్తుత ఉద్యోగుల్లో కొంతమందిని తగ్గించే యోచనలో ఉంది. ఎలాన్ మస్క్ తో కొనుగోలు ఒప్పందం ఖరారైన సమయంలోనూ ఆయన ఉద్యోగాల కోత పై మాట్లాడారు. కాని ఇప్పటివరకు దీనిపై ఆయన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక జూన్ 16న ట్విట్టర్ ఉద్యోగులతో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మస్క్.. హేతుబద్దీకరణ అవసరమని చెప్పారు. ఈ కథనాలపై ట్విటర్‌ స్పందించింది. ప్రస్తుతానికి ఎలాంటి తొలగింపు ఉండబోదని ఉద్యోగులకు హామీ ఇచ్చింది. మస్క్‌ నుంచి అలాంటి ప్రతిపాదనలేమీ రాలేదని పేర్కొంది. అయితే, కొనుగోలు ఒప్పందం అమలు కావడానికి ముందు ఇలాంటి ఊహాగానాలను మరిన్ని వినేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని అప్రమత్తం చేసింది.