సమ్మెలోకి జూడాలు.. ఎమర్జెన్సీ సేవలూ బంద్‌‌

సమ్మెలోకి జూడాలు.. ఎమర్జెన్సీ సేవలూ బంద్‌‌
  • సమ్మెలోకి జూడాలు
  • ఇయ్యాల్టి నుంచి ఎమర్జెన్సీ సేవలూ బంద్‌‌
  • డీఎంఈతో చర్చలు ఫెయిల్​
  • ఎక్స్‌‌గ్రేషియాకు నో చెప్పిన రాష్ట్ర సర్కార్
  • నిమ్స్‌‌లో బెడ్ల కేటాయింపునకు నిరాకరణ
  • ప్రభుత్వ తీరు, కేటీఆర్​ వ్యాఖ్యలపై జూడాల ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్న జూనియర్​ డాక్టర్లు సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖాన్లలో బుధవారం విధులు బహిష్కరించారు. ఎమర్జెన్సీ, ఐసీయూ డ్యూటీలకు మాత్రమే హాజరయ్యారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే గురువారం నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ డ్యూటీలను కూడా బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చి 15 రోజులవుతున్నా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు  మీడియాతో మాట్లాడారు. కరోనా డ్యూటీలు చేస్తూ  మరణించిన డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ కుటుంబ సభ్యులకు వెంటనే రూ. 50 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా చెల్లించాలన్నారు. కేంద్రం ఇచ్చే ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియాతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్కార్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు 15% పెంచాలన్నారు. కరోనా డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు 10% ఇన్సెంటివ్ ఇస్తామని గతేడాది ప్రకటించిన రాష్ట్ర సర్కార్, ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇటీవల జూడాలకు పెంచిన 15% స్టైఫండ్‌‌‌‌‌‌‌‌ను గతేడాది జనవరి నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించాలన్నారు.  డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ కుటుంబ సభ్యులకు నిమ్స్‌‌‌‌‌‌‌‌లో ఉచితంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందించాలని డిమాండ్ చేశారు.

ఇదేం పద్ధతి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, హెచ్చరికలు జారీ చేయడమేంటన్నారు. పేషెంట్లకు ట్రీట్​మెంట్​ ఇవ్వాలంటే ముందు తాము ఆరోగ్యంగా ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో34 మంది హెల్త్ స్టాఫ్ మరణించారని, కనీసం ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో డాక్టర్లకు  స్పెషల్​ ఇన్సెంటివ్స్‌‌తో పాటు ఎక్స్​గ్రేషియా ఇస్తున్నారని, మన ఏదీ లేదని చెప్పారు. 15 రోజుల కింద డీఎంఈకి సమ్మె నోటీసు ఇచ్చినా, గాంధీ హాస్పిటల్​ విజిట్​కు వచ్చినప్పుడు  సీఎం కేసీర్​కు  కూడా నోటీసు ఇచ్చినప్పటికీ కనీసం తమతో చర్చలు జరపకపోవడం దారుణమన్నారు. డీఎంఈ ఆఫీసు, సెక్రటేరియెట్​ చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతోనే సమ్మె నోటీసు ఇచ్చామన్నారు.

గాంధీలో డ్యూటీలు బహిష్కరణ
గాంధీ ఆస్పత్రిలో బుధవారం జూనియర్​ డాక్టర్లు  విధులు బహిష్కరించారు. నాన్​ కొవిడ్​తో పాటు కొవిడ్​ ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డుల్లోని డ్యూటీలను కూడా బహిష్కరించినట్లు జూడాల అసోసియేషన్​ గాంధీ  యూనిట్​ ప్రెసిడెంట్​ మణికిరణ్​రెడ్డి  చెప్పారు.  తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందన్నారు.  ఇటీవల గాంధీ హాస్పిటల్​ పర్యటన సందర్బంగా సీఎం కేసీఆర్​ తమ డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలకు పిలుస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. జూడాల సమ్మెతో గాంధీ హాస్పిటల్​లోని కొవిడ్​ ఐసీయూ, ఆక్సిజన్​ బెడ్స్​ల్లోని కరోనా పేషెంట్లు ఇబ్బంది పడినట్లు పేషెంట్ల బంధువులు చెప్పారు. కాగా జూడాల స్థానంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 

ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియాకు నో
సీఎం ఆదేశాల మేరకు బుధవారం రాత్రి డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి జూడాలతో చర్చలు జరిపారు. తమ మూడు డిమాండ్లకూ ప్రభుత్వం నో  చెప్పిందని, అందుకే సమ్మె కొనసాగిస్తామని ఈ సమావేశ తర్వాత జూడాలు ప్రకటించారు. కరోనాతో చనిపోయిన హెల్త్ వర్కర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కేంద్రం ఇస్తున్న ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియాతో సరిపెట్టుకోవాలని, రాష్ట్ర సర్కార్ తరపున ఇంకేమీ ఇవ్వబోమని డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. నిమ్స్‌‌‌‌‌‌‌‌లో కనీసం వంద బెడ్లను హెల్త్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యుల ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం కేటాయించాలని కోరగా.. ఇది కూడా సాధ్యం కాదని రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్ 15% పెంచాలని డిమాండ్ చేయగా, సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. అయితే, ప్రస్తుతం పనిచేస్తున్న 1,500 మంది సీనియర్ రెసిడెంట్ల డ్యూటీ వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంవత్సరం కింది నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చేలా చూడాలని జూడాలు కోరారు. అంటే, ఇప్పటికే పనిచేసిన 11 నెలల కాలాన్ని లెక్కగట్టి, అందుకు సమానమైన డబ్బులను ఇవ్వాలని  డిమాండ్ చేశారు. దీనికీ సర్కార్ నో చెప్పింది. దీంతో సమ్మె కొనసాగించాలని జూనియర్​ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. 

కరోనా ట్రీట్‌‌మెంట్‌‌పై ఎఫెక్ట్!
రాష్ట్రంలో 3,500 మంది జూడాలు ఉంటారు. వీరిలో జూనియర్​ రెసిడెంట్లు 2,400, సీనియర్​ రెసిడెంట్లు 1,100 మంది ఉన్నారు. ఒకేసారి వీళ్లంతా డ్యూటీలు బంద్ పెడుతుండడంతో, ఈ ఎఫెక్ట్ కరోనా పేషెంట్లపై పడనుంది. ప్రభుత్వ దవాఖాన్లలో రెగ్యులర్ డాక్టర్ల కంటే జూనియర్​ డాక్టర్లే  ఎక్కువ మంది పని చేస్తున్నారు. నైట్ డ్యూటీ, వార్డుల్లో రోజూ మూడు, నాలుగు సార్లు రౌండ్లు వేసి పేషెంట్ల బాగోగులు అర్సుకునేది వీళ్లే. వీళ్లు లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ రోగులపై పడనుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ స్టాఫ్ ఎవరూ సెలవులు పెట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది.