పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతి

పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతి
  •     అనారోగ్యంతో కొంతకాలంగా అస్వస్థత 
  •     రూ. కోటి నజరానా ప్రకటించి పట్టించుకోని గత సర్కార్ 

మణుగూరు, వెలుగు: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (62) ఆదివారం మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరంలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సకిని రామచంద్రయ్య.. కోయదొరల ఇలవేల్పు సమ్మక్క, సారలమ్మ కథను వివరిస్తూ కంచు తాళం, కంచు మేళం వాయించి దానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఈ నేపథ్యంలో  కేంద్రం 2022లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రామచంద్రయ్య అరుదైన కళను గుర్తించి సర్కారు తరఫున కోటి రూపాయల నజరానా ప్రకటించింది. జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలం, కోటి రూపాయల కోసం రామచంద్రయ్య పలుమార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ద్వారా రామచంద్రయ్య అప్పటి సీఎం కేసీఆర్​ను కూడా కలిసి తన పరిస్థితిని వివరించారు. అయితే  బీఆర్ఎస్ సర్కార్​ పట్టించుకోలేదు. ఈ లోపునే అస్వస్థతకు లోనై ఆయన తుది శ్వాస విడిచారు. పద్మశ్రీ రామచంద్రయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న భద్రాది జిల్లా కలెక్టర్ జితేష్​  వి. పాటిల్ ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.