
లాక్డౌన్ కారణంగా తనకు ఇవ్వాల్సిన జీతాన్ని తగ్గించి ఇస్తానన్నాడని.. యజమానిని చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. షామ్లీ జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ పాడిరైతు. ఆయన తనకు సాయంగా పనిచేయడం కోసం తస్లీమ్ అనే 21 ఏళ్ల యువకుడిని రూ. 15 వేల జీతానికి మాట్లాడుకున్నాడు. అయితే కరోనావైరస్ ప్రభావంతో పాలవ్యాపారం సరిగా జరగనందున.. జీతం తక్కువగా తీసుకోవాలని తస్లీమ్ ను ఓం ప్రకాష్ కోరాడు. దానికి అంగీకరించని తస్లీమ్.. ఓం ప్రకాష్ తో గొడవకు దిగాడు. ఆ గొడవలో ఓం ప్రకాష్.. తస్లీమ్ ను చెంపదెబ్బ కొట్టాడు. ఆ ఘటనను మనసులో పెట్టుకున్న తస్లీమ్.. ఓం ప్రకాష్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా.. ఓం ప్రకాష్ పడుకున్న తర్వాత కర్రతో తలపై కొట్టాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపి.. మృతదేహాన్ని సంచిలో కుక్కి సమీపంలోని బావిలో పడేశాడు. ఆ మరుసటి రోజు ఓం ప్రకాష్ బందువులు.. ఆయన కోసం తస్లీమ్ ను అడిగారు. పాలు పోయడం కోసం ఓం ప్రకాష్ వెళ్లాడని తస్లీమ్ వారికి చెప్పాడు. కానీ, పట్టుబడతానని భయపడ్డ తస్లీమ్ ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా.. ఓం ప్రకాష్ కనిపించడంలేదని ఆయన మేనల్లుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగష్టు 10 నుంచి ఓం ప్రకాష్ కనిపించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను ఓం ప్రకాష్ ను చివరిసారిగా.. తస్లీమ్ తో చూశానని పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నపోలీసులకు.. ఓం ప్రకాష్ ఇంటి సమీపంలోని బావి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు సమాచారమిచ్చారు. దాంతో బావిలో వెతకగా.. ఓం ప్రకాష్ మృతదేహం లభించింది.
దర్యాప్తులో భాగంగా.. ఓం ప్రకాష్ యొక్క మోటారుసైకిల్ మరియు మొబైల్ ఫోన్ కూడా కనిపించడంలేదని పోలీసులు గుర్తించారు. అయితే ఓం ప్రకాష్ కనిపించకుండాపోయిన మరుసటి రోజు నుంచి తస్లీమ్ కూడా కనిపించకపోవడంతో అతని కోసం వెతకడం ప్రారంభించారు. తస్లీమ్ ఇంటి దగ్గర, షామ్లీ జిల్లాలో మరియు హర్యానాలోని చాలా ప్రదేశాలలో అతని కోసం పోలీసులు వెతికారు. కానీ, అతని జాడ దొరకలేదు. అయితే తస్లీమ్ ఢిల్లీలోని రోడా కలాన్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. తస్లీమ్ నుంచి ఓం ప్రకాష్ మొబైల్ ఫోన్, బైక్ మరియు హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఆంటో అల్ఫోన్స్ తెలిపారు.
For More News..