చిన్నవానకే చెరువును తలపించేలా ఐటీ కారిడార్​ రోడ్లు

చిన్నవానకే చెరువును తలపించేలా ఐటీ కారిడార్​ రోడ్లు

మాదాపూర్​, వెలుగు: ఐటీ కారిడార్​లో చిన్న వాన పడినా ఉద్యోగులు ట్రాఫిక్ జామ్​తో ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కురిస్తే ఐటీ కారిడార్​లో వాటర్​ లాగింగ్ పాయింట్ల వద్ద  నీరు చేరి రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి.  కరోనా ఎఫెక్ట్, వర్క్ ఫ్రమ్ హోంతో రెండేళ్లుగా వానాకాలంలో ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం పడలేదు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గి కంపెనీలన్నీ తెరుచుకున్నాయి. భారీ వర్షాలు పడితే ట్రాఫిక్ జామ్​లతో ఇబ్బంది పడాల్సిందేనని ఉద్యోగులు చెప్తున్నారు.   2019 జూన్​లో కురిసిన భారీ వానకు ఐటీ కారిడార్​ మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వెహికల్స్ ​నిలిచిపోయాయి. ఐటీ ఉద్యోగులు, ఇతరులు  ఇంటికి వెళ్లేందుకు 6 నుండి 7 గంటల టైమ్ పట్టింది.   కారిడార్​లోని వాటర్​లాగింగ్​పాయింట్ల వద్ద నిలిచిన వర్షపు నీటి వల్ల తరచూ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.  ఐటీ కారిడార్​లోని 46 చోట్ల ఉన్న వాటర్​లాగిన్​పాయింట్లు వద్ద భారీగా నీరు నిలుస్తోంది.  ఆయా రూట్లలో ట్రాఫిక్​ ఎక్కువ  ఉంటుంది.   జీహెచ్‌‌ఎంసీ అధికారులు వాన పడ్డప్పుడు మాత్రమే నామ్ కే వాస్తేగా పనులు చేస్తున్నారే తప్ప, శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో వర్షం పడితే  ఆఫీసు నుంచి ఇంటికెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్​తో పాటు,  రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక అవస్థలు పడుతున్నామంటున్నారు.  

శేరిలింగంపల్లి వెస్ట్‌‌ జోన్‌‌లో...

ఐటీ కారిడార్​ మొత్తం శేరిలింగంపల్లి వెస్ట్​ జోన్ పరిధిలో ఉంది.  కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో  ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్​లో పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యాయి. దీంతో  ఐటీ కంపెనీలున్న ఏరియాలన్నీ రద్దీగా మారాయి. ఉదయం, సాయంత్రం టైమ్​లో జంక్షన్ల వద్ద ట్రాఫిక్​  కూడా ఎక్కువే.  వీటిల్లో శిల్పారామం, ఇమేజ్​ హాస్పిటల్, సీవోడీ జంక్షన్, సిటీ వైన్స్, బాటా షోరూం, కొత్తగూడ జంక్షన్​, రాడిసన్​ హోటల్, గచ్చిబౌలి సిగ్నల్, బయో డైవ
ర్సిటీ జంక్షన్, లింగంపల్లి ఆర్​యూబీ, నెక్టార్ ​గార్డెన్​వద్ద ఉన్న వాటర్​ లాగింగ్​పాయింట్లలో వర్షం కురిసినప్పుడు వరద నీరు భారీగా జామ్​ అవుతోంది. నీటిని తొలగించడానికి దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు టైం పడుతోంది. 

పట్టించుకోని అధికారులు..

 వాటర్​ లాగింగ్ ​పాయింట్లు చాలా వరకు కబ్జాకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. కానీ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ప్రతి ఏడాది వానాకాలం రాగానే రోడ్లపై  వర్షపు నీరు​ నిలవకుండా చర్యలు తీసుకుంటున్నాం, సమస్యలు పరిష్కరిస్తున్నాం అంటన్నారే తప్ప పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదు. ఈ కారణంగా వాన నీటితో రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తూ ట్రాఫిక్​ సమస్య ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు 
చెప్తున్నారు. 

ట్రాఫిక్ జామ్ అవుతున్న రూట్లు ఇవే..

మాదాపూర్​లోని​ శిల్పారామం ఎదురుగా కొండాపూర్, హైటెక్స్, కొత్తగూడ నుంచి కూకట్‌‌పల్లి, జూబ్లీహిల్స్​ వైపు వెళ్లే  వెహికల్స్ కి.మీ మేర నిలిచిపోతాయి. 
కొత్తగూడ చౌరస్తా వద్ద వాటర్ ​లాగింగ్​పాయింట్​వద్ద వర్షపు నీరు ఎక్కువగా నిలవడంతో  హైటెక్​సిటీ - హఫీజ్​పేట్ రూట్​లో వెళ్లే వెహికల్స్​కు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు తప్పడం లేదు. సైబర్​ టవర్స్​ నుంచి నీరూస్ జంక్షన్​ వరకు 3 కి.మీ ఉన్న ఈ రోడ్​లో ఇమేజ్​ హాస్పిటల్, సీవోడీ జంక్షన్, బాటా షోరూమ్​ల వద్ద వాటర్​ లాగింగ్​ ​పాయింట్లు ఉన్నాయి.  ఈ ప్రాంతాల్లో వర్షపు నీరు మోకాలి లోతు  నిలుస్తోంది. దీంతో ఈ రూట్‌‌లో వెళ్లే వెహికల్స్​కు రోడ్డు మొత్తం రెండు వైపులా బ్లాక్​ అవుతోంది. - దుర్గం చెరువు, నెక్టార్​ గార్డెన్​ వద్ద మైండ్​ స్పేస్​ నుంచి  వాన నీటితో రోడ్డు మొత్తం కనిపించకుండా పోతోంది.  దీంతో ఇనార్బిట్ మాల్​ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్​ వైపు వెళ్లే వెహికల్స్‌‌తో ట్రాఫిక్​ జామ్ అవుతోంది. రాడిసన్​  హోటల్​ వద్ద మెయిన్ రోడ్డుపై వర్షపు నీరు చెరువును తలపిస్తూ ఉంటుంది. దీని వల్ల  హఫీజ్​పేట, కొండాపూర్, కొత్తగూడ, బొటానికల్​ గార్డెన్  నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే  వెహికల్స్​తో ట్రాఫిక్​ ఉంటోంది. ఐకియా, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్​, గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్​పేట్​ వైపు వెళ్లే వాటితో ఆ రూట్ ​మొత్తం ట్రాఫిక్​జామ్ అవుతోంది.

బయోడైవర్సిటీ జంక్షన్​సమీపంలో కేర్ హాస్పిటల్ ఎదురుగా వర్షపు నీరు నిలుస్తోంది. ఈ రూట్‌‌లో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే  వెహికల్స్ కు ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. లింగంపల్లి రైల్వే అండర్​ బ్రిడ్జి వద్ద వర్షం పడితే రోడ్ క్లోజ్ అవుతుంది. ఆర్‌‌‌‌యూబీ కింద నుంచి లింగంపల్లి, తారానగర్, చందానగర్​ వైపు నుంచి గచ్చిబౌలి, హైటెక్​సిటీ, మెహిదీపట్నం రూట్‌‌లో వెహికల్స్​ బంద్​ అవుతాయి. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, చందానగర్, తారానగర్​ వైపు వెళ్లాలంటే నల్లగండ్ల ఫ్లై ఓవర్​ మీదుగా చేరుకోవాల్సి వస్తోంది.ఇంటికి వెళ్లేందుకు గంటల టైమ్ ..ఐటీ కారిడార్‌‌‌‌లో వర్షం పడితే రోడ్డుపై నీరు చేరి చెరువులా కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్​తో ఇంటికి వెళ్లేందుకు గంటల టైమ్ పడుతుంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఓపెన్ కావడం, వానాకాలం రావడంతో భారీ వర్షాలు కురిస్తే ట్రాఫిక్ ​ఇబ్బందులు తప్పేలా లేవు. బల్దియా అధికారులు ​రోడ్లపై  వాన నీరు నిలవకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. 
- దివ్య, సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్

స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం..

శేరిలింగంపల్లి జోన్​ పరిధిలో మొత్తం 46 వాటర్​ లాగింగ్​ పాయింట్లను గుర్తించాం. వీటి వద్ద 46 ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశాం. ఒక్కో టీమ్​లో ఒక ఏఈతో పాటు ముగ్గురు వర్కర్లు ఉంటారు.  వాటర్​ లాగింగ్ ​పాయింట్ల వద్ద అందుబాటులో ఉండి వర్షపు నీరు వెళ్లేలా చూస్తారు. దీంతో పాటు 45 డీ వాటరింగ్ పంప్​లు ఏర్పాటు చేశాం. 12 మాన్​సూన్, ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈసారి ఐటీ కారిడార్‌‌‌‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్​ పోలీసులతో కో ఆర్డినేషన్​ చేసుకుంటూ ట్రాఫిక్​సమస్యలు రాకుండా చూస్తున్నాం. 
- మల్లారెడ్డి, జాయింట్​ కమిషనర్, శేరిలింగంపల్లి వెస్ట్ ​జోన్