స్కూల్ ఎడ్యుకేషన్​లో అర్ధరాత్రి దాకా డ్యూటీలు!

స్కూల్ ఎడ్యుకేషన్​లో అర్ధరాత్రి దాకా డ్యూటీలు!
  • పెద్దాఫీసర్ల తీరుతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది
  • ఉదయం వచ్చి రాత్రి వరకు ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన
  • రివ్యూలకు హాజరు కాకుంటే మెమోలు, సస్పెన్షన్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏ సర్కారు ఆఫీసులోనైనా ఉద్యోగులు ఉదయం10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్లిపోతుంటారు. కానీ ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్ ​డైరెక్టరేట్​లో మాత్రం వచ్చే టైమ్​ మారకున్నా ఇంటికెళ్లే  టైమ్​ మాత్రం పెద్దాఫీసర్ల దయ మీద ఆధారపడి ఉంది. ఇక్కడి ఉద్యోగులు అర్ధరాత్రి దాకా డ్యూటీలు చేయాల్సి వస్తోంది. నెలలో ఒకట్రెండు సార్లైతే పర్లేదు కానీ.. కనీసం15 నుంచి 20 రోజులు ఇదే వ్యవహారం నడుస్తోంది. పనిగంటల తర్వాత పెద్దాఫీసర్లు ఏదో ఒక మీటింగ్, రివ్యూ పేరుతో ఆఫీసులోనే ఉంచుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వాటికి హాజరుకాకుంటే మెమోలు ఇస్తున్నారని, వేరే కారణాలు చెప్పి సస్పెండ్ చేస్తున్నారని వాపోతున్నారు. ఈ మధ్య డ్యూటీ అయ్యాక హెల్త్ బాగా లేదని ఇంటికి వెళ్లిన ఓ అధికారికి మెమో ఇచ్చారని సమాచారం. మరో సెక్షన్ అధికారి చెప్పకుండా వెళ్తున్నారని.. వేరే కారణం చూపి సస్పెండ్ చేశారనే ఆరోపణలున్నాయి. గత సోమవారం పలు డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లతో రివ్యూ అంటూ ఏకంగా తెల్లవారుజాము దాకా ఆఫీసులోనే ఉంచారని సిబ్బంది వాపోయారు. ఉన్నతాధికారులు రోజూ ఉదయం ఆఫీస్​కు వస్తే మీటింగ్స్, రివ్యూలు సాయంత్రంలోపే అవుతాయని, వాళ్లు మధ్యాహ్నం తర్వాత వచ్చి పని మొదలు పెట్టడంతోనే సమస్య ఏర్పడుతోందని సిబ్బంది చెబుతున్నారు.    

విజిటింగ్ అవర్స్ లేవ్.. 

ప్రతి ఆఫీసులో సాయంత్రం 3 నుంచి 5 వరకు విజిటింగ్ అవర్స్ ఉంటాయి. ఆ టైమ్​లో ఎవరైనా బాధితులు, ఇతరులు ఉన్నతాధికారులను కలిసేందుకు అవకాశం ఉంటుంది. కానీ స్కూల్ ఎడ్యుకేషనల్ లో విజిటింగ్ అవర్స్ ఏమీ లేవు. డైరెక్టర్ పేషీ దగ్గర గతంలో ఉన్న ఆ టైమ్ బోర్డునూ తీసేశారు. ఉన్నతాధికారిని కలవాలంటే ముందే అపాయింట్ మెంట్ తీసుకోవాలి. ఇవేవీ తెలియని చాలామంది టీచర్లు, 317 జీవో బాధితులు, మెడికల్ బిల్స్, ఇతర పెండింగ్ బిల్స్ కోసం వచ్చే టీచర్లు, టీచర్ల సంఘాల లీడర్లు గంటల తరబడి వెయిటింగ్ రూమ్​లో వేచి ఉంటున్నారు. ఇటీవల ఓ టీచర్ ఆదిలాబాద్​ నుంచి రాగా రాత్రి 7 గంటల వరకు వెయిట్ చేయించి, చివరకు ‘మేడం బిజీగా ఉన్నారు’ అని చెప్పి పంపించేశారు.  డైరెక్టరేట్​లో విజిటింగ్ అవర్స్​పెట్టి,  టైమింగ్స్ అమలు అయ్యేలా చూడాలని టీచర్లు, టీచర్ల సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ విషయమై డైరెక్టర్​ను మీడియా ప్రతినిధులు అడిగితే తనను ఎప్పుడైనా కలవొచ్చని, ప్రత్యేకంగా విజిటింగ్ అవర్స్ ఎందుకు అంటూ సమాధానమిచ్చారు.