పెండింగ్ బిల్లుల విడుదలను రూ.1500 కోట్లకు పెంచండి : ఏలూరి శ్రీనివాస రావు

పెండింగ్ బిల్లుల విడుదలను రూ.1500 కోట్లకు పెంచండి : ఏలూరి శ్రీనివాస రావు
  •     జూన్ 2 లోగా పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవాలి: సర్కారుకు ఉద్యోగుల జేఏసీ వినతి
  •     డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 13 నుంచి ఆందోళన చేస్తామని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లులను పెంచాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నెలా నెలా రిలీజ్ చేస్తున్న రూ.700 కోట్లను రూ. 1,500 కోట్లకు పెంచాలన్నారు. ఇందులో రిటైర్డ్ ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగులకు సగం సగం అవుతాయన్నారు. మంగళవారం మలక్ పేటలోని రెవెన్యూ భవన్ లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) సమావేశం జరిగింది. 

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఈ మీటింగ్ లో చర్చించారు. పీఆర్ సీ ఏర్పాటు చేసి 30 నెలలు గడుస్తున్నందున.. 51 శాతం ఫిట్‌‌మెంట్‌‌తో నివేదికను తెప్పించి జూన్ 2 లోపు అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. అనంతరం సమస్యలపై తీర్మానాలు చేసి ఆందోళనల షెడ్యూల్ ను మీటింగ్ లో ప్రకటించారు. మీటింగ్ అనంతరం చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.

ఈ నెల 13 నుంచి వచ్చే నెల 14 వరకు ఆందోళనలు

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13 నుంచి వచ్చే నెల 14 వరకు దశలవారీ ఆందోళనలు చేస్తామని మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 13న ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 

ఈ నెల 17న మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, వినతి పత్రాలు అందజేస్తామని, వచ్చే నెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో, కలెక్టరేట్ల దగ్గర సామూహిక నిరసన దీక్షలు చేపడుతున్నామన్నారు. వచ్చే నెల 14న మరోసారి జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జగదీశ్వర్, శ్రీనివాసరావు ప్రకటించారు. ఈహెచ్‌‌ఎస్  స్కీం విధివిధానాలను వెంటనే అమలులోకి తెచ్చి, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. 

రాష్ట్రంలో సీపీఎస్  విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని తీర్మానించారు. ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. ఈ సమావేశంలో నేతలు ముజీబ్, శ్యామ్, కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, జేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్ సి. దామోదర్ రెడ్డితో పాటు పలువురు కో-చైర్మన్లు, వైస్-చైర్మన్లు, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు పాల్గొన్నారు.