నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లకే జమ
త్వరలో కొత్త చట్టం: మంత్రి అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పేరెంట్స్‌ను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాల్లోనే జమ చేసేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం బంజారాహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో వృద్ధుల భద్రత, గౌరవం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అక్టోబర్ 1న జరగాల్సిన వేడుకలను అనివార్య కారణాల వల్ల ఈ నెల 26కు నిర్వహించాల్సి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32.69 లక్షల మంది వృద్ధులు ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 15.60 లక్షల మంది వృద్ధులకు నెలకు రూ.2,016 చొప్పున ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.3,056.94 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వృద్ధుల కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం తెలంగాణలో ప్రత్యేక ‘ఆన్‌లైన్ పోర్టల్’ను తీసుకొచ్చామని మంత్రి గుర్తుచేశారు.
