చత్తీస్ గఢ్ ఎన్నికల్లో మహిళల సత్తా

చత్తీస్ గఢ్ ఎన్నికల్లో మహిళల సత్తా

రాయ్ పూర్: చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. శాసనసభకు19 మంది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి 11 మంది, బీజేపీ నుంచి ఎనిమిది మంది మహిళా క్యాండిడేట్స్ గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వారిలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.  బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రేణుకా సింగ్, ఎంపీ గోమ్తి సాయి, రాష్ట్ర మాజీ మంత్రి లతా ఉసెంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది మహిళలు మాత్రమే గెలుపొందగా, ఈ సారి మరో ఆరుగురు విజయకేతనం ఎగుర వేశారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి 15 మంది, కాంగ్రెస్ నుంచి 18 మంది, జనతా కాంగ్రెస్ చత్తీస్ గఢ్ (జే) (జేసీసీ)(జే) నుంచి 11 మంది, బీఎస్పీ నుంచి ఏడుగురు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు మహిళలు బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 1181 మంది అభ్యర్థులు పోటీ పడగా ఇందులో 155 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.  చత్తీస్ గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా 54 సీట్లను బీజేపీ గెలుచుకుని విజయఢంకా మోగించింది.