
పోలీస్.. దయానాయక్ పోలీస్.. ఈ ఒక్క మాట చాలు.. ముంబై అండర్ వరల్డ్ మాఫియాకు ఉచ్చ కారిపోయిద్ది.. ముంబైలో రౌడీలు, గూండాలు, మాఫియా రాజ్యం నడుస్తున్న టైంలో.. దయానాయక్ ఫ్రమ్ క్రైంబ్రాంచ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఇతను.. దేశంలోని పోలీస్ శాఖకే రోల్ మోడల్ అయ్యాడు.. గూండాల గుండెల్లో బుల్లెట్లు పల్లీల లెక్క దింపిండు అంటే మాటలా మరి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను పట్టుకుని కేసులు పెట్టి.. జైళ్లకు తరలించి.. కోర్టుల్లో శిక్షలు వేయటం అంటే చాలా చాలా సమయం పడుతుంది.. అలాంటి క్రిమినల్స్ జైళ్లల్లో ఉన్నా బయట ఉన్నా దందాలు మాత్రం ఆపరు.. నెట్ వర్క్ మాత్రం తగ్గదు.. ఇలాంటి టైంలో క్రిమినల్స్‌ను ఏరిపారేయటానికి ఎన్ కౌంటర్లు అనే ఆయుధాన్ని సమర్థవంతంగా నిర్వహించి.. రౌడీలు, గూండాలు, మాఫియా వాళ్లకు సింహస్వప్నం అయ్యారు దయానాయక్.
ముంబైని క్రైం ఫ్రీ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన దయానాయక్ ఆపరేషన్.. ఆయన్ను ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్గా మార్చేసింది.. ఎన్ కౌంటర్ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చింది.. అంతేనా రాంగోపాల్ వర్మ తీసిన చాలా సినిమాలకు దయానాయక్ ఓ ముడి కథ.. మన తెలుగు హీరో గోపీచంద్ తీసిన గోలీమార్ మూవీ దయానాయక్ స్టోరీనే.. నానాపటేకర్ తీసిన అబ్ తక్ ఛప్పన్ మూవీ కూడా దయానాయక్ స్టోరీనే అంటారు.. ముంబై ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గురించి ఇప్పుడు ఎందుకు అంటారా.. ఆయన రిటైర్ అయ్యారు.. 2025, జూలై 31వ తేదీన పోలీస్ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు.. కాకపోతే రిటైర్ అయ్యే రెండు రోజుల ముందు ఏసీపీ.. ACP.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా ప్రమోషన్ తీసుకుని.. రిటైర్ మెంట్ ఇచ్చారు.
దయా నాయక్ నేపథ్యం:
ముంబై అండర్ వరల్డ్ డాన్లను గడగడలాడించిన దయా నాయక్ కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. పుట్టింది కర్నాటకలో అయినప్పటికీ ఆయన ఎక్కువగా ముంబైలోనే చదువుకున్నారు. దీంతో డిపార్ట్మెంట్లో జాయిన్ కాకముందే దయా నాయక్‌కు దేశ ఆర్థిక రాజధానితో బంధం ఏర్పడింది. అంధేరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1995లో ఎస్ఐగా ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో తన ప్రస్థానం మొదలు పెట్టారు. దయా నాయక్ పోలీసుగా విధుల్లో చేరిన సమయంలో ముంబైలో అండర్ వరల్డ్ అనధికారంగా రాజ్యమేలుతోంది. ఏరియాకు ఒక డాన్.. విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలకు ముంబై స్థావరంగా మారింది.
ఆ రోజుల్లో అండర్ వరల్డ్ భయానికి కొందరు పోలీసులు ఉద్యోగం అంటేనే జంకిపోయే వారంటే అర్ధం చేసుకోవచ్చు పరిస్థితులు ఎలా ఉండేయో. ఇలాంటి సమయంలో డిపార్ట్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చిన దయా నాయక్.. తన పేరులో ఉన్న దయా అనే గుణానికి పూర్తి విరుద్ధంగా పని చేశారు. క్రైమ్‌లు చేసే వారి కనిపిస్తే ఆయన రెచ్చిపోయి గుండెల్లో బుల్లెట్లు దింపేవారు. ఎన్ కౌంటర్ల పేరుతో దయా నాయక్ సృష్టించిన భయంతో ఒకానొక సమయంలో ముంబైలో రౌడీలు, గూండాలు, మాఫియా భయంతో వణికిపోయింది. ముఖ్యంగా 1996లో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మోరుమోగిపోయింది.
చోటా రాజన్ పేరు చెబితేనే వణికిపోయే రోజుల్లో ఏకంగా ఆయన గ్యాంగ్ సభ్యులను నడిరోడ్డుపై కాల్చి చంపడంతో ముంబైలో దయా నాయక్ ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. దయా నాయక్ దాదాపు 80 ఎన్ కౌంటర్లు చేసినట్లు పోలీస్ వర్గాల్లో టాక్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరుగాంచిన దయా నాయక్ జాబ్ కెరీలో ఒక్క మచ్చ ఉంది. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా ఆయన తనకు ఎంతో ఇష్టమని పోలీస్ ఉద్యోగానికి కొన్ని రోజులు దూరం కావాల్సి వచ్చింది.
ఈ కేసులో యాంటి కరప్షన్ బ్యూరో ఆయనను విచారించి చివరకు 2012లో క్లీన్ చిట్ ఇవ్వడంతో దయా నాయక్ తిరిగి డిపార్ట్మెంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. డిపార్ట్మెంట్లోని కొందరు ఉన్నతాధికారులే దయా నాయక్‌కు వస్తోన్న పేరు, ప్రఖ్యాతలు చూసి ఓర్వలేక కావాలని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరికించారని ఒక ప్రచారం ఉంది. దయా నాయక్ ఆయన 30 ఏళ్ల సర్వీసులో ఎక్కువ కాలం ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో విధులు నిర్వహించారు. మహారాష్ట్ర యాంటి టెర్రరిజం స్వ్కాడ్ లో కూడా ఆయన పని చేశారు.
2021లో ముఖేష్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు, ఠాణె వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరెన్ హత్య కేసు.. ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు వంటి హై ప్రొఫెల్ కేసులను దయా నాయక్ ఇంటరాగేట్ చేశారు. ఎస్ఐగా కెరీర్ మొదలుపెట్టిన దయా నాయక్ 30 ఏళ్లలో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. పోలీస్ శాఖకే ఐకానిక్‌గా మారిన దయా నాయక్ 2025, జూలై 31న రిటైర్ అయ్యారు. డిపార్ట్మెంట్ కోసం సర్వం ధార పోసిన దయా నాయక్‌కు పదవి విరమణకు రెండు రోజులు ముందు ప్రమోషన్ లభించింది.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP)గా ప్రమోషన్ తీసుకుని ఆయన డిపార్ట్మెంట్కు వీడ్కోలు పలికారు. పదవి విరమణకు సరిగ్గా రెండు రోజుల ముందు ఏసీపీగా ప్రమోషన్ రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. యూనిఫామ్‌ను శాశ్వతంగా గోడకు వేలాడదీయానికి రెండు రోజుల ముందు ACP యూనిఫాం ధరించడం హ్యాపీగా ఉంది. ఈ ప్రమోషన్ తనకు చివర్లో వచ్చిన కానీ.. మొత్తం నా సర్వీస్‌కు ఇది ఆశీర్వాదంలా ఉంది. ఇది కేవలం పదోన్నతి మాత్రమే కాకుండా క్రమశిక్షణ, విధుల పట్ల నా అంకితభావాన్ని సూచిస్తుంది’’ అని పేర్కొన్నారు దయా నాయక్.